టెలికాం సంస్థలు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా, టాటా టెలీసర్వీస్లకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. తమ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ, రూ.1.47 లక్షల కోట్ల ఏజీఆర్ బకాయిలను గడువులోగా టెలికాం విభాగానికి (డీఓటీ) చెల్లించపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని కోర్టు ధిక్కరణగా ఎందుకు పరిగణించకూడదో తెలపాలని ఆదేశించింది.
నాన్ సెన్స్..
జస్టిస్ అరుణ్‌మిశ్రా, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఎం.ఆర్.షాల త్రిసభ్య ధర్మాసనం డీఓటీ డెస్క్ ఆఫీసర్ ఉత్తర్వుపై అభ్యంతరం తెలిపింది. టెలికాం సంస్థలు ఏజీఆర్ బకాయిలు చెల్లించాలని తాము ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ డీఓటీ డెస్క్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది.
"ఈ అర్థంపర్థంలేని దాన్ని ఎవరు సృష్టిస్తున్నారో మాకు తెలియడంలేదు. అసలు ఈ దేశంలో న్యాయం ఉందా! దీనిని చూస్తూ ఇక్కడ ఉండడం కంటే దేశం విడిచిపోవడం మంచిది."- ధర్మాసనం
టెల్కోలు, ఇతరులు ఏజీఆర్ బకాయిలు చెల్లించకపోయినా, వారిని బలవంతపెట్టద్దని డీఓటీ డెస్క్ అధికారి... ఆటార్నీ జనరల్, ఇతర రాజ్యాంగ అధికారులకు లేఖ రాశారు.
చెల్లించాల్సిందే..
2020 జనవరి 23 లోపు టెలికాం సంస్థలు రూ.1.47 లక్షల కోట్ల ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సిందేనని ఇంతకు ముందు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
కంపెనీల వారీగా బాకాయిలు ఇలా..
- ఎయిర్టెల్ రూ.21,682.13 కోట్లు
- వొడాఫోన్-ఐడియా రూ.19,823.71 కోట్లు
- ఆర్‌కాం రూ.16,456.47 కోట్లు
- బీఎస్ఎన్ఎల్ రూ.2,098.72 కోట్లు
- ఎంటీఎన్ఎల్ రూ.2,537.48 కోట్లు
ఇదీ చూడండి: ఎయిర్టెల్, వొడాఫోన్- ఐడియాలకు సుప్రీం సమన్లు!