"పేదరికం.. ఎటు చూసినా ఆకలి కేకలు.. పేదోడు పేదరికంలో కూరుకుపోతున్నాడు.. ధనికుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు. వీటన్నింటినీ మార్చాలంటే కుబేరులు.. వారి ఆస్తులను అమ్మేసి పేదలకు సహాయం చేయాల్సిందే!"... ఇవి మనం తరచూ వినే మాటలు. వీటిని వింటుంటే నిజమే కదా! అనిపిస్తుంది. ఇంతకీ.. ధనికులు పేదరికాన్ని నిర్మూలించగలరా?
బిలియనీర్లకు సాధ్యమా?
ఆక్స్ఫామ్ ప్రకారం.. ప్రపంచంలోని తొలి 2,153 మంది కుబేరుల సంపద... 460 కోట్ల మంది ప్రజల సంపదకన్నా ఎక్కువే! ఈ విధంగా చూసుకుంటే.. సంపన్నులు తలుచుకుంటే పేదరికాన్ని ఇట్టే మాయం చేయగలరనిపిస్తుంది. కుబేరులైన జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, బిల్ గేట్స్ వంటి వారు ఉదారంగా ప్రజలకు తమ సంపదను పంచేస్తే అందరూ సుఖసంతోషాలతో జీవించగలరనిపిస్తుంది. కానీ అది అంత సులభం కాదు. ఎందుకంటే వారి సంపద చాలావరకు ఆస్తుల రూపంలోనే ఉంటుంది. నోట్ల కట్టలుగా ఉండదు.
ఉదాహరణకు.. ఇప్పుడు బిలియనీర్లు వారి సంపదను పేదలకు ఉచితంగా పంచేస్తున్నారని అనుకుందాం. అందులో వారి కంపెనీ షేర్లు కూడా ఉంటాయి. వాటిని విరాళంగా ఇవ్వలేరు. అమ్మాల్సి వస్తుంది. అంత మొత్తాన్ని అమ్మడం మొదలుపెడితే.. అమ్మకాల ఒత్తిడి తట్టుకోలేక, కంపెనీ భారీ నష్టాల్లోకి జారుకుంటుంది. కంపెనీ దివాలా తీసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇదే జరిగితే.. షేర్ హోల్డర్లు పేదోళ్లుగా మారిపోతారు!
అందువల్ల పేదరికాన్ని నిర్మూలించడం పూర్తిగా బిలియనీర్ల చేతిలో లేదు. కానీ ఈ బిలియనీర్లలో చాలా మంది.. విరాళాలు ఇస్తూ, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేస్తూ పేదలకు ఎప్పటికప్పుడు సహాయం చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఈ కుబేరుల కెరీర్ ఎలా మొదలైందో తెలుసా?
ఇదీ చూడండి: కుబేరులే కానీ.. ఆదాయపు పన్ను చెల్లించరట!