ప్రస్తుత కాలంలో చాలా మంది తమ మరణానంతరం అవయవ దానానికి ముందుకొస్తున్నారు. అయితే, బతికుండగానే అవయవదానం చేయడం అనేది మన దేశంలో ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉంది. 18 ఏళ్ల వయసు పైబడిన వారు ఎవరైనా తమ అవయవాలు దానం చేయవచ్చు.
2002లో తన కిడ్నీ దానం చేసినట్లు తెలియచేయడం వల్ల ప్రస్తుతమున్న ఆరోగ్య బీమా పాలసీ పునరుద్ధరణ కావట్లేదని, అందువల్ల కొత్త పాలసీ కోసం ప్రయత్నిస్తున్నట్లు , గురుగ్రామ్‌కు చెందిన సోనాలి ఛటర్జీ తెలిపారు. ఇందుకోసం ఆమె ఫేస్ బుక్ లాంటి మాధ్యమాన్ని ఎంచుకున్నారు.
ప్రభుత్వ సంస్థ నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ ప్రకారం మరణించిన తరువాత అవయవ దానం చేసిన వారి సంఖ్య 2013లో భారతదేశంలో 313 మంది కాగా ఈ సంఖ్య 2017 నాటికి 905కి పెరిగింది. అయితే జీవించి ఉండగా అవయవదానం చేసే వారి సంఖ్య మెరుగుపడలేదు.అధిక శాతం కిడ్ని మార్పిడి జీవించి ఉండగా దానం చేయడం ద్వారా జరుగుతున్నాయి. అందువల్ల కిడ్ని మార్పిడి అవసరమైన ప్రతీ 2 లక్షల మందిలో 10వేల మందికి మాత్రమే దాతలు అందుబాటులో ఉంటున్నారు.
మీరు అవయవదాత అవ్వాలనుకుంటే , ఆరోగ్య బీమా విషయంలో ఈ కింది విషయాలు గుర్తుంచుకోండి:
చాలా ఆరోగ్య బీమా పాలసీలు అవయవ గ్రహీతకు అయ్యే ఖర్చులను చెల్లిస్తాయే కానీ, దాతకు అయ్యే ఖర్చులను చెల్లించవు. ఎందుకంటే అవయవదానం ఒక స్వచ్ఛంద నిర్ణయం కాబట్టి. డీహెచ్ఎఫ్ఎల్ జనరల్ ఇన్సురెన్స్, ఎస్‌బీఐ జనరల్ ఇన్సురెన్స్ వంటి సంస్థలు మాత్రమే అవయవ దాత ఆసుపత్రి ఖర్చులను కూడా పరిమితులకు లోబడి చెల్లిస్తున్నాయి. మీరు అవయవదాత అయి ఉండి, కొత్తగా ఆరోగ్య బీమా పాలసీకి ప్రయత్నిస్తే , అధిక రిస్క్ కారణంగా బీమా సంస్థ తిరస్కరణకు గురిచేయొచ్చు.
ఆరోగ్య బీమా పాలసీ పొందటామా.. లేదా.. అనేది మీరు దానం చేసిన అవయవంపై ఆధారపడి ఉంటుంది. కాలేయం తిరిగి వృద్ధి చెందగలదు కాబట్టి, దీని దానం వల్ల కూడా పాలసీ పొందొచ్చు. అదే మాత్రపిండాల విషయంలో బీమా పాలసీ పొందే అవకాశం తక్కువ.
అనుకూలమైన విషయం ఏమిటంటే, పాలసీ పునరుద్ధరణ సమయంలో మీ అవయవదాన విషయం గురించి బీమా సంస్థతో చెర్చించవచ్చు. కానీ, తెలియచేయవలసిన అవసరం లేదు. పాలసీ పునరుద్ధరణ ఆన్లైన్లో కూడా చేయొచ్చు కాబట్టి, ఐఆర్‌డీఏఐ నియమాల ప్రకారం పాలసీ తిరస్కరణకు గురికాదు. కానీ నిర్దేశించిన సమయంలో పాలసీ పునరుద్ధరణ పూర్తి కాకపోతే బీమా సంస్థలు పాలసీని రద్దు చేసే అవకాశం ఉంది. సాధారణంగా ఇందుకు 30 రోజుల సమయం ఉంటుంది.
పాలసీ తీసుకునే ముందే అవయవదానం చేసి ఉండి, ఆ విషయాన్ని బీమా సంస్థకు తెలుపకపోతే, వైద్య సమాచారాన్ని దాచినట్లుగా భావించి ఆ కారణంతో పునరుద్ధరణ సమయంలో పాలసీని తిరస్కరించే అవకాశం ఉంది.
చివరిగా:
పాలసీ కొనుగోలు చేసే ముందే మీకు సంబంధించిన పూర్తి వైద్య సమాచారాన్ని బీమా సంస్థకు తెలియపరచి, నిర్ధిష్ట సమయం లోపల పునరుద్ధరణ కోసం సంప్రదించినప్పటికీ, బీమా సంస్థ మీ పాలసీని తిరస్కరిస్తే, పునరుద్ధరణ కోసం బీమా అంబుడ్స్‌మెన్‌ను సంప్రదించవచ్చు. అక్కడ మీకు సరైన పరిష్కారం లభించకపోతే మీరు ఐఆర్‌డీఏఐకు మీ సమస్యను తెలియజేయవచ్చు.