బీమా సంస్థలన్నీ ఆరోగ్య బీమా క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియలో మరింత పారదర్శకంగా ఉండాలని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఆదేశించింది. క్లెయిమ్‌ను తిరస్కరించినట్లయితే పాలసీదారులకు తగిన కారణాలను పక్కాగా తెలియజేయాలని నిర్దేశించింది. ఈ మేరకు క్లెయిమ్ ప్రక్రియలో.. పాలసీదారులకు స్పష్టమైన, పారదర్శక సమాచారాన్ని అందించేలా బీమా సంస్థలు విధివిధానాలను రూపొందించాలని ఐఆర్డీఏఐ ఒక ప్రకటనలో తెలిపింది.
అప్డేట్లు తప్పనిసరి..
పాలసీదారుడు క్లెయిమ్ చేసుకునేందుకు నగదు రహిత అభ్యర్థనలను స్వీకరించాలని ఐఆర్డీఏఐ సూచించింది. పాలసీదారులకు క్లెయిమ్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు బీమా సంస్థలు వ్యవస్థలను కలిగి ఉండాలని సూచించింది. సదరు అభ్యర్థన అందినప్పటి నుంచి తగిన నిర్ణయం తీసుకునే వరకు స్టేటస్‌ను తెలియజేస్తూ ఉండాలని తెలిపింది.
తిరస్కరణకు పక్కా కారణం..
బీమా సంస్థల తరఫున టీపీఏలు క్లెయిమ్‌లను పరిష్కరిస్తున్నట్లయితే.. వాటి స్థితిని తెలుసుకునేందుకు పాలసీదారులకు సమాచారం ఇవ్వాలని నియంత్రణ సంస్థ సూచించింది. అలాగే ఊహలు, అంచనాలను బట్టి క్లెయిమ్‌లను తిరస్కరించొద్దని బీమా సంస్థలను కోరింది. హెల్త్ ఇన్సూరెన్స్ రెగ్యులేషన్స్-2016 ప్రకారం.. తిరస్కరణకు గల నిర్ధిష్ట కారణాలను తెలియజేయాల్సి ఉంటుందని తెలిపింది.
సెటిల్మెంట్..
పాలసీదారులకు క్లెయిమ్ చెల్లింపులు జరపకపోతే.. అందుకుగల కారణాలను తప్పనిసరిగా తెలియజేయాలని పేర్కొంది. ఈ వివరాలను ఆయా కంపెనీలోని ఫిర్యాదుల పరిష్కార విభాగం సహా.. బీమా అంబుడ్స్‌మన్‌తో పాటు సంబంధిత కార్యాలయాలకూ అందించాలని స్పష్టం చేసింది. 'హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సెటిల్మెంట్' పేరిట.. జీవిత, సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలు సహా.. థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్(టీపీఏ)లు ఈ నిబంధనలు పాటించేలా ప్రకటనను విడుదల చేసింది ఐఆర్డీఏఐ.
ఈ చర్యలతో క్లెయిమ్‌లు పారదర్శకంగా, నిర్ణీత కాలపరిమితిలో పరిష్కారం అవుతాయని ఐఆర్డీఐఏ అంచనా వేసింది. బీమా సంస్థలు, టీపీఏలు.. అవసరమైన ప్రతి చోటా ఈ నిబంధనలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. పంట బీమా, క్రెడిట్ బీమా రంగానికి ఈ మార్గదర్శకాలు వర్తించవని ఐఆర్డీఏఐ తెలిపింది.
ఇదీ చదవండి: మార్చి వరకు బీమా ఆన్‌లైన్: ఐఆర్డీఏఐ