Investment in Government Bonds: అత్యంత సురక్షితమైన పథకాలను ఎంచుకోవాలని భావించేవారికి.. ప్రభుత్వ బాండ్లకు మించి ఏముంటాయి చెప్పండి. ప్రభుత్వమే మీ డబ్బుకు హామీ ఉంటుంది. కాబట్టి, అసలుకూ, వడ్డీకీ ఏ మాత్రం ఢోకా ఉండదు. కాకపోతే.. బ్యాంకుల్లో వచ్చే వడ్డీతో పోలిస్తే.. రాబడి కాస్త తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు అధికంగానూ ఉంటుంది.
Why buy Government Bonds
- దీర్ఘకాలం పాటు పెట్టుబడిని కొనసాగించేందుకు వీలుగా ఈ బాండ్లను ఎంచుకోవచ్చు. ఈ బాండ్లు గరిష్ఠంగా స్వల్ప కాలం నుంచి గరిష్ఠంగా 40 ఏళ్ల వ్యవధికీ అందుబాటులో ఉంటాయి. ఇంత దీర్ఘకాలంలో బ్యాంకుల వడ్డీ రేట్లు అనేకసార్లు మార్పులు చేర్పులకు లోనవుతాయి. బాండ్లలో మదుపు చేయడం వల్ల దీర్ఘకాలం పాటు మంచి రాబడిని ఆర్జించేందుకు వీలవుతుంది.
- ప్రభుత్వ బాండ్లలో మదుపు చేసే గిల్ట్ ఫండ్లతో పోల్చి చూసినా.. అందులోనూ ఎంతోకొంత నష్టభయం ఇమిడి ఉంటుంది. ఇవి తమ పెట్టుబడులను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండటమే అందుకు కారణం. మార్కెట్ స్థితిగతులను బట్టి, మీ పెట్టుబడి వృద్ధి ఆధారపడి ఉంటుంది. కానీ, బాండ్లలో మదుపు చేయడం వల్ల ఎలాంటి నష్టభయం లేకుండా.. రాబడిని సొంతం చేసుకోవచ్చు.
- కొన్నిసార్లు బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే ప్రభుత్వ బాండ్లకే అధిక వడ్డీ రేటు వస్తుంది. ఇప్పుడు ఎఫ్‌డీ వడ్డీ రేటు అన్ని బ్యాంకుల్లోనూ తక్కువగానే ఉంది. కానీ, డిసెంబరు 15, 2021 నాటికి 10 ఏళ్ల వ్యవధితో కర్ణాటక ప్రభుత్వ బాండ్లు 6.83 శాతం వడ్డీని అందిస్తున్నాయి. చాలా బ్యాంకులతో పోలిస్తే ఇది అధికమే.
ఇతర పథకాలు కావాలంటే..
Government Bonds Investment: ప్రభుత్వ బాండ్లకు బదులుగా ఇతర పెట్టుబడి పథకాలను పరిశీలించాలనుకున్నప్పుడు మనకు కొన్ని ప్రత్యామ్నాయాలూ అందుబాటులో ఉన్నాయి.
- ఆర్‌బీఐ ఫ్లోటింగ్ రేటు బాండ్లలో పోస్టాఫీసు జాతీయ పొదుపు పత్రాలకన్నా 0.35శాతం అధిక రాబడి వస్తుంది. ఇది ప్రతి ఆరు నెలలకోసారి మారుతుంది. అయితే, వీటిని రుణాల కోసం హామీగా పెట్టలేం. వీటిలో ఏడేళ్లవరకూ కొనసాగాలి.
- వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గుల నుంచి పెట్టుబడిని కాపాడుకునేందుకు ఫిక్స్‌డ్ డిపాజిట్లను పరిశీలించవచ్చు. గిల్ట్ ఫండ్లూ ఒక ప్రత్యామ్నాయమే. సీనియర్ సిటిజన్లు ప్రధానమంత్రి వయ వందన యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీంలాంటివి ఎంచుకోవచ్చు.
ప్రతికూలతలూ ఉన్నాయి...
- ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీకి పన్ను వర్తించినట్లుగానే.. బాండ్ల పైన వచ్చిన ఆదాయానికి వర్తించే శ్లాబుల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గిల్ట్ ఫండ్లలో మదుపు చేసినప్పుడు పన్ను భారం అంతగా ఉండదు.
- ఒకసారి బాండ్లలో మదుపు చేసిన తర్వాత అందులో నుంచి పెట్టుబడి వెనక్కి తీసుకోవడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. బాండ్లను హామీగా ఉంచి, రుణం తీసుకునే వీలుంది. కానీ, ఇంకా ఈ వెసులుబాటును అందుబాటులోకి తీసుకురాలేదు.
- వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పుడు.. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో తక్కువ వడ్డీ వస్తుంది. కానీ, బాండ్ మార్కెట్లో పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో బాండ్లలో పెట్టిన పెట్టుబడి మొత్తమూ తగ్గుతూ వస్తుంది. ఇది కాస్త ప్రతికూల అంశమే.
ఇదీ చదవండి: Gita Gopinath Crypto: 'క్రిప్టో కరెన్సీని నిషేధిస్తే లాభం లేదు'