ఫేస్‌బుక్‌కు చెందిన ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్(Instagram).. మరో కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. 'ఎక్స్‌క్లూజివ్ స్టోరీస్' పేరుతో రానున్న ఈ ఫీచర్(Instagram latest features)తో క్రియేటర్స్ కూడా డబ్బులు సంపాదించే అవకాశం ఉందని సమాచారం.
ఇప్పటికే ఉన్న స్టోరీస్ ఫీచర్‌కు మరిన్ని హంగులు దిద్ది.. ఈ ఎక్స్‌క్లూజివ్ స్టోరీస్‌ను రూపొందించింది ఇన్స్టాగ్రామ్. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఇటీవల ట్విట్టర్ తీసుకొచ్చిన 'సూపర్ ఫాలో' ఫీచర్‌కు పోటీగా ఇన్‌స్టా ఈ కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
ఎలా పని చేస్తుంది?
ఇది సాధారణ స్టోరీస్లాంటి ఫీచరే అయినప్పటికీ.. ఇందులో భారీ మార్పులు చేయనుంది ఇన్‌స్టా. ఇందులో స్టోరీస్‌ను తమ ఫాలోవర్స్‌లో ఎవరు చూడాలి అనేది యూజర్ నిర్ణయించుకోవచ్చు. ఎక్స్‌క్లూజివ్ స్టోరీస్‌ను స్క్రీన్‌షాట్ తీసుకునే అవకాశం కూడా ఉండదు. ఇతర యూజర్లు ఈ స్టోరీస్ చూడాలంటే డబ్బులు చెల్లించి మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. మెంబర్షిప్ తీసుకున్నవారు మాత్రమే ఎక్స్‌క్లూజివ్ స్టోరీస్ చూసేందుకు వీలుంటుంది.
అయితే ఈ ఫీచర్.. ఇన్‌స్టా క్రియేటర్ బ్యాడ్జ్ ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉండనుందని తెలుస్తోంది. దీనిపై మరింత స్పష్టత రావాలంటే ఇన్స్టాగ్రామ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సిందే.
ఇదీ చదవండి:పిక్సల్స్ ఎక్కువ ఉంటేనే మంచి ఫోనా?