దేశ సేవా రంగ కార్యకలాపాలు గత డిసెంబర్లో పుంజుకొని ఐదు నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. కొత్త వ్యాపార ఆర్డర్లు సహా ఉద్యోగ కల్పన వంటి అంశాలు ఇందుకు దోహదం చేసినట్లు ఓ సర్వేలో వెల్లడైంది.
నవంబర్లో 52.7 శాతం ఉన్న ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా సర్వీసెస్ యాక్టివిటీ ఇండెక్స్ డిసెంబర్ నాటికి ఐదునెలల గరిష్ఠమైన 53.3 శాతానికి చేరుకుంది. 2019లో జులై తర్వాత అత్యధికంగా పెరగడం ఇదే తొలిసారి.
"ఉద్యోగకల్పన, నూతన ఆర్డర్లలో పెరుగుదల సహా వ్యాపారాలలో వృద్ధి వంటి అంశాలు 2020 ప్రథమార్థంలోనూ ఈ వృద్ధి కొనసాగేందుకు ఉపకరించవచ్చు"
-పొల్యన్నా డి లిమా, ఐహెచ్ఎస్ మార్కిట్ ప్రిన్సిపల్ ఎకానమిస్ట్
తయారీ రంగం లోపాలు సైతం తగ్గుముఖం పట్టడం వల్ల 2019-20 మూడో త్రైమాసికంలో నిరాశాజనకంగా ఉన్న ప్రైవేటు రంగ ప్రదర్శన ప్రస్తుతం ఉత్తేజభరితంగా ఉన్నట్లు లీమా పేర్కొన్నారు. అయితే నిరంతర పురోగతి నమోదవుతున్నా... వృద్ధి రేటు అసాధారణంగానే ఉన్నట్లు వెల్లడించారు.
పెరిగిన ఉద్యోగ కల్పన
ఆహార, ఇంధన, ఔషధ, రవాణా రంగాలు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నందున డిసెంబర్లో ఇన్పుట్ ధరలు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. నూతన వ్యాపార సంస్థలు, సేవా సంస్థలు అదనపు ఉద్యోగులను చేర్చుకోవడం ద్వారా డిసెంబర్లో ఉద్యోగ కల్పన 28 నెలల గరిష్ఠానికి చేరుకున్నట్లు స్పష్టం చేసింది.