దేశంలో బ్యాంకింగ్ రంగానికి కొవిడ్-19 మహమ్మారి రెండో దశతో పెను సవాళ్లు ఎదురు కాబోతున్నాయని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ ఒక తాజా నివేదికలో స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో బ్యాంకుల పనితీరుపై ఈ ప్రభావం కనిపిస్తుందని విశ్లేషించింది. వచ్చే ఒక ఏడాది నుంచి ఏడాదిన్నర కాలంలో బ్యాంకులకు రాని బాకీలు స్థూల రుణాల మొత్తంలో 11- 12 శాతం వరకూ ఉండే పరిస్థితి కనిపిస్తున్నట్లు పేర్కొంది.
సూక్ష్మ రుణాలు, పర్యాటక రంగాలకు కేంద్ర ప్రభుత్వం ఉద్దీపనా పథకాలు ప్రకటించింది. అదేవిధంగా చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్‌ఎమ్‌ఈ) రుణాల గ్యారెంటీ సదుపాయాన్ని కల్పించింది. ఈ చర్యల వల్ల ఆయా రంగాలకు చెందిన సంస్థలకు జారీ చేసిన రుణాలపై బ్యాంకులకు కొంత మేరకు ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ మొత్తం మీద చూస్తే బ్యాంకులకు సమీప భవిష్యత్తులో కష్టాలు తప్పేటట్లు లేవని ఎల్‌అండ్‌పీ గ్లోబల్ భావిస్తోంది. దాదాపు 70 శాతం జనాభాకు టీకా ఇవ్వటానికి ప్రస్తుత పరిస్థితుల్లో మరో ఏడాది కాలం అయినా పడుతుందని, అప్పటి వరకూ ఆర్థికాభివృద్ధిపై స్ధిరమైన అంచనా కట్టలేమని పేర్కొంది. కాకపోతే ఉత్పత్తి రంగానికి, ఎగుమతులకు కొవిడ్-19 మొదటి దశతో పోల్చితే రెండోసారి తక్కువ నష్టం జరిగినట్లు వివరించింది. ప్రస్తుతం ఆర్థిక కార్యకలాపాలు కొంత కోలుకుంటున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ప్రజల పొదుపు మొత్తాలు క్షీణించిన పరిస్థితుల్లో, వినియోగం తగ్గుముఖం పడుతోందని పేర్కొంది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ సత్వరం కోలుకునే అవకాశాలు తగ్గిపోయినట్లు వివరించింది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22), నిజ స్థూల జాతీయోత్పత్తి (రియల్ జీడీపీ) వృద్ధి రేటు 9.5 కంటే ఉండకపోవచ్చని అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో బ్యాంకులకు కష్టాలు తప్పకపోవచ్చు- అని పేర్కొంది.
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో బ్యాంకులు అతి తక్కువగా రుణాలు ఇచ్చాయి. దీనికి తోడు రాని బాకీల ముప్పు ఉండనే ఉంది. ముఖ్యంగా పర్యాటక ప్రాజెక్టులు, వాణిజ్య రియల్ ఎస్టేట్, సెక్యూరిటీ లేని రిటైల్ రుణాలు... రాని బాకీలు మారిపోయే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేసింది. సూక్ష్మ రుణ సంస్థలు, ఎస్‌ఎంఈ రంగాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రుణ మద్దతు చర్యల వల్ల కొంత మేరకు బ్యాంకులు జారీ చేసిన రుణాలపై ఒత్తిడి తగ్గుతుందని, అయినప్పటికీ రుణాల వసూలు ప్రస్తుత పరిస్థితుల్లో అంత సులువైన వ్యవహారం కాదని వివరించింది.
కొవిడ్-19 రెండో దశతో ఆతిథ్య రంగానికి పెనునష్టం
అనూహ్యంగా ముంచుకొచ్చిన కొవిడ్-19 మహమ్మారి రెండో దశతో ఆతిథ్య రంగానికి పెనునష్టం వాటిల్లినట్లు రేటింగ్ సేవల సంస్థ ఇక్రా విశ్లేషించింది. కోలుకునే దిశగా ముందుకు సాగుతున్న ఆతిథ్య రంగం దీనివల్ల మళ్లీ కష్టాల్లో కూరుకుపోయిందని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కొవిడ్-19 మహమ్మారి రెండో దశ శరవేగంగా విస్తరించి ఎంతో ప్రాణ నష్టాన్ని కలుగజేసిన విషయం తెలిసిందే. అప్పుడప్పుడే గాడిన పడుతున్న ఆతిథ్య రంగం, దీనివల్ల మరో 6- 8 నెలలు వెనక్కి వెళ్లిపోయిందని ఈ సంస్థ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ రంగంలో గత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికంలో కొంత వృద్ధి కనిపించిందని, కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎంతమాత్రం వ్యాపార కార్యకలాపాలు సాగలేదని వివరించింది. కొవిడ్-19 రెండో దశ ప్రభావం అంతా ఇంతా కాదు, ఆతిథ్య రంగాన్ని ఎంతగానో కుంగదీసింది- అని ఇక్రా సెక్టార్ హెడ్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్. వినుతా అన్నారు. దీని నుంచి కోలుకోవటానికి చాలా సమయం పడుతుందని, కొవిడ్-19 కంటే ముందు నాటి స్థితికి ఆతిథ్య రంగం 2023-24 ఆర్థిక సంవత్సరంలో కానీ చేరుకోలేదని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రంగంలోని సంస్థలకు ఆదాయ నష్టం, నిర్వహణ నష్టాలతో పాటు రుణాలు సకాలంలో చెల్లించలేని పరిస్థితి ఎదురు కావచ్చని పేర్కొంది.
ఇదీ చదవండి : ఆ వస్తువుల ధరలు భారీగా తగ్గాయా? నిజమెంత?