బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీ సంస్థకు సంబంధించిన రెట్రోస్పెక్టివ్(వెనకటి తేదీ నుంచి విధించిన) పన్ను వివాదం కేసులో భారత్‌కు చుక్కెదురైంది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (ఆర్బిట్రేషన్) కెయిర్న్ ఎనర్జీకి అనుకూల తీర్పు వెలువరించింది. భారత్ కోరిన పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. పైగా ఈ కేసు నేపథ్యంలో భారత్ నిలిపివేసిన డివిడెండ్లు, పన్ను తిరిగిచెల్లింపులు సహా ట్యాక్స్ వసూలు కోసం అమ్మిన షేర్ల ద్వారా వచ్చిన సొమ్మును వడ్డీతో కలిపి రూ.7,600 కోట్లు కెయిర్న్ ఎనర్జీకే భారత ప్రభుత్వం చెల్లించాలని ఆదేశించింది.
ఇది రెండోది..
గత మూడు నెలల్లో భారత్‌కు ఇది రెండో ప్రతికూల తీర్పు కావడం గమనార్హం. గతంలో వొడాఫోన్ సంస్థకు సంబంధించిన రెట్రోస్పెక్టివ్ కేసు విషయంలోనూ భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ తీర్పును సవాల్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం గత నెల దిల్లీ హైకోర్టుకు తెలిపింది. భారత్‌లో ఆపరేట్ అవుతున్న వ్యాపార-వాణిజ్య కార్యకలాపాలు ఇక్కడి చట్టాలకు లోబడే జరగాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆర్బిట్రేషన్ తీర్పు భారత చట్టాలను అనుసరించి ఉండాలని పేర్కొంది. అయితే, ఆర్బిట్రేషన్ తీర్పును సవాల్ చేసేందుకు ఉన్న 90 రోజుల గడువు రేపటితో ముగియనుండటం గమనార్హం.
2006లో కంపెనీ అంతర్గత పునర్‌వ్యవస్థీకరణ సమాచారాన్ని కోరుతూ కేంద్ర ప్రభుత్వ పన్నుల విభాగం కెయిర్న్ ఎనర్జీకి నోటీసులు జారీ చేసింది. వాటిని పరిశీలించిన అనంతరం 2015లో రూ.10,247 కోట్ల పన్నులు చెల్లించాలని కోరింది. పునర్‌వ్యవస్థీకరణ వల్ల వచ్చిన మూలధన రాబడిపై ఈ మేరకు పన్ను చెల్లించాలని తెలిపింది. ఇదిలా ఉండగా.. 2010-11లో కెయిర్న్ ఎనర్జీ భారత్‌లోని తన అనుబంధ సంస్థ ‘కెయిర్న్ ఇండియా’ను వేదాంతకు విక్రయించింది. ఈ క్రమంలో వేదాంతలో ప్రిఫరెన్షియల్ షేర్లతో పాటు ఐదు శాతం వాటాలను ఇచ్చారు.
దీంతో వేదాంతలోని ఐదు శాతం కెయిర్న్ ఎనర్జీ షేర్లను భారత ప్రభుత్వం అటాచ్ చేసింది. అలాగే రూ.1,140 కోట్ల డివిడెండ్లు, రూ.1,590 కోట్ల ట్యాక్స్ రీఫండ్‌ను నిలిపివేసింది. తదనంతరం తమకు రావాల్సిన పన్ను వసూలు కోసం అటాచ్ చేసిన వేదాంత షేర్లను విక్రయించింది. దీంతో బ్రిటన్-భారత్ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం(బీఐటీ) కింద ఈ నోటీసులను సవాలు చేస్తూ కెయిర్న్ ఎనర్జీ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ద్వైపాక్షిక పెట్టుబడి పరిరక్షణ ఒప్పందాన్ని పన్ను నోటీసులు ఉల్లంఘించాయంటూ తీర్పునిచ్చింది. అలాగే నిలిపివేసిన డివిడెంట్లు, ట్యాక్స్ రీఫండ్, షేర్ల విక్రయం వల్ల వాటిల్లిన నష్టం నేపథ్యంలో తిరిగి భారత ప్రభుత్వమే కెయిర్న్ ఎనర్జీకి రూ.7,600 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: అమెజాన్‌కు ఊరట- అంబానీ, బియానీ ఒప్పందంపై స్టే