ఈ ఏడాదిలో దేశ జీడీపీ 12.5 శాతానికి పెరుగుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ఇటీవల అంచనా వేసింది. అయితే 2020 కరోనా సమయంలో భారత జీడీపీ 8 శాతం క్షీణించిందని.. దాని నుంచి కోలుకోవాలంటే మరింత అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ ఐఎంఎఫ్ అధికారి పెట్యా కోవా బ్రూక్స్ తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉందన్న ఆమె.. కోలుకోవడానికి మరో ఉద్దీపన ప్యాకేజీ అవసరం ఉందని పేర్కొన్నారు.
"ఈ ఆర్థిక సంవత్సరానికి 12.5 వృద్ధిని అంచనా వేస్తున్నాము. పీఎంఐ డేటా, వాణిజ్యం సూచికలను పరిశీలిస్తే ఇదే అర్థం అవుతోంది. ఈ కారణాలతో మొదటి త్రైమాసికంలో కూడా మెరుగైన వృద్ధి కనబరుస్తుందని నమ్ముతున్నాము. భారత్ ఇలా పుంజుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఇటీవల కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విధిస్తున్న లాక్డౌన్ల ప్రభావం కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థపై ఉంటుంది."
- పెట్యా కోవా బ్రూక్స్, సీనియర్ ఐఎంఎఫ్ అధికారిణి
కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్రం అనేక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్న బ్రూక్స్.. ఆ ఆర్థిక విధానాలు ప్రస్తుతం ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. అనేక రంగాల వారికి ఆర్థిక సాయం అందించడం, మరికొన్ని సడలింపులతో పాటు నియంత్రణ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. భారత్ చేపట్టిన చర్యలను ఐఎంఎఫ్ స్వాగతించినట్లు బ్రూక్స్ తెలిపారు. ముఖ్యంగా ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై ఎక్కువ ఖర్చు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: '2021లో 12.5 శాతానికి దేశ జీడీపీ'