కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఉద్యోగ నియామకాలు భారీగా తగ్గాయని ప్రముఖ జాబ్ పోర్టల్ నౌక్రీ.కామ్ తెలిపింది. రిటైల్ పరిశ్రమలు, రవాణా, విమానయానం, సేవల రంగాల్లో నియామక కార్యకలాపాలు మార్చిలో నెమ్మదించినట్లు వెల్లడించింది.
మానవ వనరుల నియామకాలకు సంబంధించి రిటైల్ రంగంలో 50 శాతం తగ్గుదల నమోదైందని నౌక్రీ జాబ్ స్పీక్ ఇండెక్స్ మార్చి 2020 నివేదిక స్పష్టం చేసింది. తర్వాతి స్థానాల్లో 38 శాతంతో వాహనరంగం ఉండగా.. ఫార్మా 26 శాతం, బీమా 11 శాతం, ఫినాన్స్ 10 శాతం, ఐటీ-సాఫ్ట్ వేర్ 9 శాతం, బీఎఫ్ఎస్ఐ 9 శాతం తగ్గుదల నమోదు చేశాయి.
మార్చిలో మొదటి 20 రోజుల్లో 5 శాతం మాత్రమే క్షీణించినట్లు నౌక్రీ.కామ్ ప్రధాన వ్యాపార అధికారి(సీబీఓ) పవన్ గోయల్ తెలిపారు.
"దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా వ్యవస్థాగతంగా నియామకాల్లో తగ్గుదల నమోదైంది. దాదాపు ఇదంతా చివరి 10 రోజుల్లోనే క్షీణత నమోదైంది. మొత్తంగా ఉద్యోగ నియామక కార్యకలాపాలు 18 శాతం తగ్గాయి. "
- పవన్ గోయల్, నౌక్రీ.కామ్ సీబీఓ
ఉద్యోగ నియామకాల్లో తగ్గుదల సూచనలు జనవరి నుంచే కనిపించాయి. జనవరిలో 5.75 శాతం మాత్రమే పెరుగుదల నమోదు కాగా.. ఫిబ్రవరిలో ఎలాంటి వృద్ధి నమోదు కాలేదు.
మెట్రో నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దిల్లీలో 26 శాతం, హైదరాబాద్ లో 24 శాతం, చెన్నైలో 18 శాతం ఉద్యోగ నియమాకాలు తగ్గాయి.
ప్రొఫెషనల్స్ నియామకంలోనూ..
అనుభవ స్థాయిల్లోనూ నియామకాల కార్యకలాపాలు ప్రతికూలంగానే ఉన్నాయి. సేవల రంగంలో 63 శాతం, బ్యాంకింగ్ 28 శాతం, ఫినాన్స్ 23 శాతం, ఐటీ-హార్డ్ వేర్ 22 శాతం ప్రొఫెషనల్స్ కు డిమాండ్ తగ్గింది. సీనియర్ స్థాయి (13 ఏళ్లు)లోనూ 29 శాతం క్షీణించగా.. ఎంట్రీ లెవల్ (0-7 ఏళ్లు)లో 16 శాతం తగ్గుదల నమోదైంది.
వైట్ కాలర్ సెగ్మెంట్ లో ఉండే ఐటీ, బీపీఓ, ఐటీఈఎస్, బీఎఫ్ఎస్ఐ, ఫినాన్స్ రంగాల్లో తగ్గుదల సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లు, మార్కెటింగ్ లో భారీగా తగ్గుదల కనిపించింది.
ఇదీ చూడండి: కరోనా కాలంలోనూ ఉద్యోగులకు ఆ సంస్థ బంపర్ ఆఫర్