ప్రపంచ దేశాలకు మొబైల్ ఫోన్లను, విడిభాగాలను ఎగుమతి చేసేందుకు భారతదేశం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోందని భారత సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ సంఘం(ఐసీఈఏ) వెల్లడించింది. 'ప్రారంభం, పునరుద్ధరణ, పునరుత్తేజం' అనే వ్యూహాలతో 2025 నాటికి ఇక్కడి నుంచి 10వేల కోట్ల డాలర్ల (100 బిలియన్ డాలర్లు) విలువైన మొబైల్ ఫోన్లనూ, దాదాపు 4 వేల కోట్ల డాలర్ల విలువైన విడిభాగాలను ఎగుమతి చేయాలని లక్ష్యంగా విధించుకున్నట్లు పేర్కొంది. ఈవై ఇండియాతో కలిసి కొవిడ్-19 తర్వాత మొబైల్ ఫోన్ల ఉత్పత్తి, అవకాశాలు అనే అంశంపై గురువారం ఒక నివేదికను విడుదల చేసింది. చైనా, వియత్నాంలోపాటు, ప్రపంచ వ్యాప్తంగా ఐదు సంస్థలు ప్రపంచ మార్కెట్‌లో 80శాతానికి పైగా వాటా ఉంది. దాదాపు 198 దేశాలు మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకుంటున్నాయి.
ప్రస్తుతం మూడోస్థానంలో...
ఇలాంటి తరుణంలో భారత్ ఎలా అడుగులు వేయాలన్న దానికి ఏం చేయాలనే అంశాలను ఇందులో చర్చించారు. మొబైల్ ఎగుమతుల్లో ప్రస్తుతం భారత్ 3 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉంది. త్వరలోనే రెండోస్థానంలోకి చేరాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఐసీఈఏ పేర్కొంది. కొవిడ్-19 తర్వాత దేశీయ ఉత్పత్తి రంగానికి నాయకత్వం వహించడానికి మొబైల్, విడిభాగాల రంగం సిద్ధంగా ఉందని ఐసీఈఏ ఛైర్మన్ పంకజ్ మోహింద్రూ తెలిపారు. గురువారం దృశ్యమాధ్యమం ద్వారా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆగస్టు నాటికి 100 శాతం ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
'ఈఎంసీ 2.0' అందుకే..
దేశంలో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం ఇటీవలే మూడు పథకాలను ప్రవేశ పెట్టిందని తెలిపారు. పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ పరికరాల తయారీకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం (పీఎల్‌ఐ), విడిభాగాలు, సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించేందుకు ‘స్పెక్స్’, ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ల ఏర్పాటు కోసం ‘ఈఎంసీ 2.0’లను ప్రారంభించిందని, దీనికోసం రూ.50వేల కోట్లను కేటాయించారని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా భారతీయ మొబైల్ పరిశ్రమ వృద్ధి పథంలో సాగుతోందని చెప్పారు. రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో ప్రపంచ స్థాయి కంపెనీలు.. తమ ఉత్పత్తుల తయారీకి మన దేశంపై ఆధారరపడాల్సిన పరిస్థితులు వస్తాయని పేర్కొన్నారు.
ఈవై ఇండియా పరోక్ష పన్నుల పార్ట్‌నర్ బిపిన్ సాప్రా మాట్లాడుతూ.. పీఎల్‌ఐ, స్పెక్స్, ఈఎంసీ వంటి ప్రోత్సాహక పథకాల ద్వారా మొబైల్, వాటి విడిభాగాల ఉత్పత్తిలో పునరుత్తేజం తీసుకొస్తుందని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ప్రపంచ సరఫరా చైన్‌ను సృష్టించడం, ఉత్పాదక వ్యయాలు తగ్గించడం, తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసి, ప్రపంచ స్థాయిలో పోటీపడటం, రాష్ట్రాల భాగస్వామ్యం తదితర అంశాలనూ నివేదిక ప్రస్తావించింది. లావా ఇంటర్నేషనల్ సీఎండీ హరి ఓం రాయ్ మాట్లాడుతూ.. డిజైన్, సరఫరా, ఉత్పత్తి విభాగాల్లో నైపుణ్యాలను పెంచడం సహా.. ప్రపంచ మార్కెట్ కోసం సిద్ధంగా ఉండాలని తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా సంక్షోభంలో ల్యాప్‌టాప్ అమ్మకాల జోరు