కరోనా ప్రభావం నుంచి స్థిరాస్తి మార్కెట్ వృద్ధిని నమోదు చేస్తోందని క్రెడాయ్ హైదరాబాద్ విశ్లేషించింది. కొవిడ్ ముందు కంటే కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల ధరలు పెరిగాయని.. చదరపు అడుగు రూ.500 నుంచి రూ.1500 వరకు ఉన్నాయని నిర్మాణదారులు చెబుతున్నారు.భూములు, సిమెంట్, స్టీలు, లేబర్ ఛార్జీల్లో పెరుగుదల ఉండడంతో మున్ముందు ఇవి మరింత ఊపందుకునే అవకాశం ఉందంటున్నారు. అనుమతి లేకుండానే ముందస్తు అమ్మకాలు... సగం ధరకే ఫ్లాట్ అంటూ మోసపూరిత ప్రకటనలతో విక్రయిస్తున్నారని.. కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
కొనుగోళ్లు పెరిగాయ్: పి.రామకృష్ణారావు. అధ్యక్షుడు, క్రెడాయ్ హైదరాబాద్
* కొవిడ్ తర్వాత ఇళ్లకు డిమాండ్ పెరిగింది. అంతకు ముందున్న స్థాయి కంటే ఎక్కువే విక్రయాలు ఉన్నాయి. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి.
* ఇన్నాళ్లు తమ నిర్ణయాలను వాయిదా వేసినవారు ఇప్పుడు కొనుగోలు చేస్తున్నారు.
* కరోనా సమయంలో అద్దె ఇళ్లలో సౌకర్యాలు లేక ఎదుర్కొన్న ఇబ్బందుల దృష్ట్యా సొంతింటిని సమకూర్చుకుంటున్నారు.
* దశాబ్దకాలం తర్వాత అత్యంత తక్కువగా 6.90 నుంచి 7.50 శాతానికే గృహ రుణ వడ్డీరేట్లు దిగిరావడంతో కొనుగోళ్లు పెరిగాయి.
* కొవిడ్‌కు ముందు ఎక్కువగా పశ్చిమ హైదరాబాద్‌లో ఇళ్ల కొనుగోళ్లకు మొగ్గుచూపితే.. ఇప్పుడు ఎక్కడ ఉన్న వాళ్లు అక్కడే కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తూర్పు ఉప్పల్, ఉత్తరం కొంపల్లి వైపు నిర్మాణాలు పెరిగాయి. దక్షిణం వైపు శంషాబాద్‌లో ఇప్పుడిప్పుడే ప్రారంభం అయింది. మరో రెండేళ్లలో ఈ ప్రాంతం పూర్తిగా పుంజుకుంటుంది.
* 30 శాతం నిర్మాణ వ్యయం పెరిగింది. కొత్త ప్రాజెక్టుల్లో మున్ముందు ఇళ్ల ధరలు పెరిగే అవకాశం ఉంది.
* అనుమతి ఉన్న, రెరాలో నమోదు చేసిన ప్రాజెక్టుల్లోనే ఇళ్లు కొనండి. ప్రస్తుతం మార్కెట్లో సగం ధరకే ఫ్లాట్ అంటూ, ముందస్తు బుకింగ్‌ల పేరుతో అనైతిక వ్యాపారానికి కొందరు తెరతీశారు. అవిభాజ్య స్థలం (యూడీఎస్) పేరుతో ఎకరం స్థలాన్ని వంద నుంచి రెండు వందల మందికి విక్రయించి.. ఈ భూమిని చూపించి మరో వంద నుంచి రెండు వందల మంది దగ్గర సగం ధరకే ఫ్లాట్ అంటూ మొత్తం సొమ్ము కట్టించుకుంటున్నారు. పది నుంచి ఇరవై అంతస్తులు కడతామని అంటున్నారు. గృహ, వాణిజ్య నిర్మాణాలకు బుకింగ్స్ చేస్తున్నారు. ఇలాంటిచోట్ల కొని మోసపోవద్దు. వీరిలో 90 శాతం మందికి కట్టే ఆర్థిక స్థాయి లేదని మా పరిశీలనలో తేలింది. ప్రస్తుతం యూడీఎస్ మార్కెట్‌కు క్యాన్సర్‌లా మారింది. ఇప్పటికే ఈ తరహా అనైతిక కార్యకలాపాలను అరికట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ప్రభుత్వం సైతం రిజిస్ట్రేషన్, జీఎస్‌టీ రూపంలో ఆదాయం కోల్పోతుంది. కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలి.
పారిశ్రామిక రంగం విస్తరణతో జోష్: వి.రాజశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి, క్రెడాయ్ హైదరాబాద్
లాక్‌డౌన్ అనంతరం మార్కెట్ ఎలా ఉంటుందోనని ఆందోళన చెందినా.. గత ఏడాది మూడో త్రైమాసికం నుంచే అవన్ని పటాపంచలు అయ్యాయి. మిగతా నగరాల కంటే వేగంగా హైదరాబాద్ కోలుకుంది.
* ఇక్కడ ఐటీ రంగం బాగుంది. పలు కొత్త పరిశ్రమలు నగరం చుట్టుపక్కల చందన్‌వెల్లి, సుల్తాన్‌పూర్ ప్రాంతాల్లో వస్తున్నాయి. ఈ-సిటీలో కొన్ని ఏర్పాటయ్యాయి. మూడు ప్రాంతాల్లో అమెజాన్ డాటా సెంటర్లు వస్తున్నాయి. ఫార్మా సిటీ రాబోతుంది. దీనికి తోడు సాగునీటి సౌకర్యంతో వ్యవసాయ రంగం పుంజుకుంది. అగ్రి ఎకానమీ పెరగడం కూడా స్థిరాస్తి మార్కెట్ వృద్ధికి దోహదం చేస్తుంది. ఏ ఒక్క రంగంపైనో ఆధారపడి కాకుండా అన్ని విధాలుగా మెరుగ్గా ఉండటంతో మార్కెట్ పెరుగుతోంది.
* ప్రభుత్వ ప్రోత్సాహకాలు సైతం కొత్త పెట్టుబడులు వచ్చేందుకు దోహదం చేస్తున్నాయి. స్థిరాస్తి పరిశ్రమకు సంబంధించి అనుమతుల గడువు పొడిగించడం, వాయిదాల పద్ధతిలో అనుమతుల ఫీజు చెల్లించే వెసులుబాటు కల్పించడంతో కొత్త ప్రాజెక్టులు ఇటీవల భారీగా పెరిగాయి. కొవిడ్ సమయంలోనూ 6.7 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన కార్యాలయాల లీజింగ్ పూర్తయింది. క్రమంగా ఏడాదిలో 10 మిలియన్లకు చేరుకుంటుంది. ఈ లీజింగ్ పెరిగేకొద్దీ ఉపాధి అవకాశాలు..తద్వారా ఇళ్లకు డిమాండ్ ఉంటుంది. వచ్చే ఐదు నుంచి పదేళ్లపాటూ వృద్ధి కొనసాగే అవకాశం ఉంది.
* ఇటీవల అనుమతులు లేకుండా అవిభాజ్య స్థలం(యూడీఎస్) పేరిట రూ.25వేల కోట్ల వరకు ముందస్తు అమ్మకాల పేరుతో వసూలు చేశారు. కొద్ది మంది కారణంగా స్థిరాస్తి పరిశ్రమ మొత్తానికే నష్టం వాలిల్లే ప్రమాదం ఉండటంతో కొనుగోలుదారులు నష్టపోకముందే ప్రభుత్వం చొరవ చూపాలి.
మరికొన్నాళ్లు దూకుడు గానే..
* వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు అత్యంత ప్రాధాన్యత కేంద్రంగా హైదరాబాద్ నిలుస్తోంది. ముఖ్యంగా భారీ ఎంఎన్‌సీలు ఈ ప్రాంతంపై ఆసక్తి చూపిస్తున్నాయి. ఇవన్నీ కూడా పరోక్షంగా స్థిరాస్తి మార్కెట్ వృద్ధికి దోహదం చేస్తున్నాయి.
* ఐటీ ఎగుమతుల వృద్ధి 1.25 ట్రిలియన్ రూపాయలకు చేరింది. వార్షికంగా 18 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది.
* హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిశ్రమలో పెట్టుబడులు 2019-2020లో బిలియన్ డాలర్లుగా నిలిచాయి. రాబోయే త్రైమాసికాల్లో ఈ పెట్టుబడులు మరింతగా పెరగొచ్చు అని అంచనా.
* దేశంలో కార్యాలయాల లీజింగ్‌లో 2020లో 20 శాతం తోడ్పాటు హైదరాబాద్ అందించింది. భారీ అంతర్జాతీయ సంస్థలు పెద్ద మొత్తంలో కార్యాలయాలను లీజుకు తీసుకున్నాయి.
* గత ఏడాది వెల్స్‌ఫర్గో 10.18 లక్షల చదరపు అడుగులు తీసుకుంటే.. గూగుల్ 3 లక్షలు చదరపు అడుగులు, ఐబీఎం 2.5 లక్షలు, స్మార్ట్‌వర్క్స్ 2.4 లక్షలు, విప్రో 1.8 లక్షల చదరపు అడుగుల కార్యాలయాలను లీజుకు తీసుకున్నాయి.
* భవిష్యత్తు విస్తరణ దృష్ట్యా సౌకర్యవంతమైన కార్యాలయాల ప్రాంగణాలకు నగరంలో డిమాండ్ కొనసాగుతోంది. బెంగళూరు తర్వాత హైదరాబాద్ ఐటీ రంగం పరంగా వృద్ధి చెందుతోంది. కో వర్కింగ్ ప్రాంగణాల పరంగా పోటీపడుతోంది.
* తెలంగాణ ప్రాంతవాసులతో పాటూ చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి ఇక్కడ ఎక్కువగా కొనుగోళ్లు చేసేవారు. ఉత్తరాది వాసులు ఎక్కువగా ఇళ్లు కొనేవాళ్లు. ఇప్పుడు వీరు సైతం భూములపై పెట్టుబడులు పెడుతున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నిధులు ఇక్కడ రియల్ ఎస్టేట్‌లో పెడుతున్నారు.