కరోనా వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వేతన జీవులు కొంత మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి వారందరికీ ఉపశమనం కల్పించటానికి ప్రభుత్వం పీఎఫ్ ఖాతా నుంచి కొంత మొత్తాన్ని తీసుకునేందుకు వెసులుబాటు ఇచ్చింది. కరోనా మొదటి వేవ్‌లో ఒకసారి, ప్రస్తుతం కొనసాగుతోన్న రెండో దశలో మరోసారి ఈ అవకాశం కల్పించింది.
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఉద్యోగి నెలవారీ వేతనం(బేసిక్+డీఏ)లో 12శాతం మొత్తాన్ని ఈపీఎఫ్ అకౌంట్‌కు జమ చేస్తారు. పనిచేస్తున్న సంస్థ కూడా అంతే మొత్తం జమ చేస్తుంది. కంపెనీ ఇస్తున్న 12శాతంలో 8.3 శాతం గరిష్ఠంగా ఈపీఎస్(ఎంప్లాయి పెన్షన్ స్కీమ్) ఖాతాకు అందుతాయి. మిగతా 3.67 శాతం ఈపీఎఫ్‌కు చేరతాయి.
కింది సందర్భాల్లో భవిష్య నిధి నుంచి కొంత మొత్తాన్ని తీసుకోవచ్చు.
సొంత వివాహం, పిల్లలు, సోదరుల పెళ్లిళ్లు..
- 7 సంవత్సరాల సర్వీస్ పీరియడ్ ఉన్నట్లయితే సొంత పెళ్లి, పిల్లల పెళ్లి, సోదరుడు లేదా సోదరి పెళ్లి సందర్భంగా ఈపీఎఫ్ ఖాతా నుంచి కొంత మొత్తం తీసుకోవచ్చు. ఉద్యోగం చేస్తున్న సమయంలో 3 సార్లు తీసుకోవచ్చు. మీ జీతం నుంచి ఈపీఎఫ్ ఖాతాలో జమ అయిన మొత్తంలో 50 శాతానికి మించకుండా తీసుకోవచ్చు.
- సొంత డిపాజిట్ నుంచి మాత్రమే తీసుకోవచ్చు. సంస్థ నుంచి జమ అయిన మొత్తాన్ని తీసుకోరాదు.
సొంత చదువులు లేదా పిల్లల చదువులు
- 7 సంవత్సరాల సర్వీస్ పీరియడ్ ఉన్నట్లయితే సొంత చదువులు లేదా పిల్లల చదువుల కోసం కొంత మొత్తాన్ని తీసుకోవచ్చు. పదో తరగతి(పోస్ట్ మెట్రిక్)అనంతరం చదువులకు మాత్రమే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఉద్యోగి కంట్రిబ్యుషన్లో 50 శాతం వరకు మాత్రమే ఈ కారణంతో తీసుకోవచ్చు.
- పెళ్లి, విద్యకు కలిపి మొత్తం మూడు సార్లు తీసుకోవచ్చు.
భూమి, ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణం
- ఇల్లు లేదా భూమి కొనుగోలుకు లేదా ఇంటి నిర్మాణం విషయంలో కొంత మొత్తం తీసుకోవచ్చు. 5 సంవత్సరాల సర్వీస్ ఉన్నట్లయితే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. భూమి కొనుగోలు చేయటానికైతే నెలవారీ వేతనానికి 24 రెట్లు ఉపసంహరించుకోవచ్చు.
- జీవిత కాలంలో ఒక సారి మాత్రమే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంటి నిర్మాణం లేదా కొనుగోలుకు సంబంధించినట్లయితే వేతనంలో 36 రెట్ల మొత్తం ఈపీఎఫ్ నుంచి తీసుకోవచ్చు. ఇల్లు లేదా భూమి చందాదారుని పేరు మీద కానీ లేదా భార్య/భర్త లేదా ఇద్దరి పేరు కానీ ఉండాలి. వేతనం అంటే బేసిక్ తో డీఏను కలపగా వచ్చేది మాత్రమే.
ప్రస్తుత గృహ రుణాన్ని తిరిగి చెల్లించటం
- గృహ రుణాన్ని గడువు కంటే ముందే చెల్లించేందుకు(ప్రీ పే) కూడా ఈపీఎఫ్ నుంచి కొంత మొత్తాన్ని తీసుకోవచ్చు. 10 సంవత్సరాల సర్వీస్ ఉన్నట్లయితే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. దీనిని జీవిత కాలంలో ఒక సారి మాత్రమే ఉపయోగించుకోవచ్చు.
- భూమి కొనుగోలు, ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణం.. గృహ రుణాన్ని తిరిగి చెల్లించటంలో ఒక దాని కోసం మాత్రమే ఈపీఎఫ్ ఖాతా నుంచి కొంత మొత్తం ఉపయోగించుకోవచ్చు. అంటే ఒకదాని కోసం ఈపీఎఫ్ ఖాతా నుంచి తీసుకున్నట్లయితే ఇంకో కారణంతో తీసుకోరాదు.
- వేతనానికి 36 రెట్లు ఈ కారణంతో తీసుకోవచ్చు. అయితే గృహం తన పేరు మీద కానీ, భార్య పేరు మీద కానీ, లేదా ఇద్దరి ఉమ్మడి ఆస్తి కానీ ఉండాలి. చాలా మంది తల్లిదండ్రులు, సోదరుడు లేదా సోదరితో ఉమ్మడి యజమానిగా ఉంటారు. ఇలాంటి వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోరాదు.
- ఈ సదుపాయం ద్వారా వచ్చే మొత్తం సరాసరి రుణం తీసుకున్న బ్యాంకు, ఫైనాన్స్ కంపెనీ ఖాతాలో జమ అవుతుంది.
- ఉద్యోగి కంట్రిబ్యూషన్తో పాటు సంస్థ కంట్రిబ్యుషన్ నుంచి కూడా నగదును తీసుకోవచ్చు.
ఇల్లు రిపేర్లు, మార్పులు చేయటం
- ఇల్లు కట్టిన కొంత కాలానికి ఆ గృహంలో మార్పులు చేయాల్సి రావచ్చు. ఈ అవసరానికి ఈపీఎఫ్ ఖాతా నుంచి కొంత మొత్తాన్ని పొందవచ్చు.
- నెలవారీ వేతనానికి 12 రెట్లు తీసుకోవచ్చు. ఇల్లు నిర్మాణం పూర్తయి 5 సంవత్సరాలు దాటి ఉండాలి. పది సంవత్సరాల సర్వీస్ ఉండాలి. ఒక్కసారి మాత్రమే.. ఈ కారణంతో కొంత మొత్తాన్ని తీసుకోవచ్చు. ఇల్లు ఉద్యోగి పేరు, ఉద్యోగి భర్త/భార్య పేరు, ఉమ్మడిగా అయినా ఉండాలి.
ఆరోగ్య చికిత్స
- ఏ కారణంగానైనా ఒక నెల కంటే ఎక్కువ కాలం ఆస్పత్రిలో చికిత్స తీసుకోవటం
- మేజర్ శస్త్ర చికిత్స
- క్షయ, పక్షవాతం, క్యాన్సర్, కుష్టు, గుండె సంబంధిత వ్యాధులు, మాససిక వ్యాధులు ఉండి.. వాటి చికిత్స కోసం పనిచేస్తున్న కంపెనీ సెలవు ఇవ్వటం
పైన తెలిపిన వాటిలో ఏ సందర్బంలోనైనా ఈపీఎఫ్ ఖాతా నుంచి కొంత మొత్తం తీసుకోవచ్చు.
సర్వీస్‌లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ కారణంతో కొంత మొత్తాన్ని తీసుకోవచ్చు. వేతనానికి ఆరు రెట్లు మాత్రమే ఈ కారణంతో పొందవచ్చు. జీవిత కాలంలో ఎన్ని సార్లు అయినా ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చు.
పింఛను ఆగిపోతుందా?
ఈ కారణాలతో పాటు కరోనా వల్ల ఇచ్చినట్లు అప్పుడప్పుడు వెసులుబాటు ఇస్తుంది. కొంత మొత్తం తీసుకుంటే ఫించనుపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఇలా తీసుకునే మొత్తం భవిష్య నిధి నుంచి మాత్రమే వస్తుంది. ఉద్యోగి ఫించను ఖాతా వేరే ఉంటుంది. దీనిలో నగదు తీసుకోవటానికి ఉండదు కాబట్టి రిటైర్మెంట్ సమయంలో పింఛను యథావిథిగా వస్తుంది.
ఇదీ చదవండి : SBI Kavach: కొవిడ్ చికిత్సకు వ్యక్తిగత రుణం