ఉచిత కాల్స్, తక్కువ ధరకే డేటా అందిస్తూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో... ఇక నుంచి కాల్ ఛార్జీలు వసూలు చేయనుంది. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై నిమిషానికి 6 పైసలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది ఆ సంస్థ. నేటి నుంచి రీఛార్జ్ చేసే వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది.
సంస్థ తాజా నిర్ణయంతో రీఛార్జ్ ఎలా చేసుకోవాలి, కాల్ ఛార్జీలు ఏవిధంగా ఉండనున్నాయి అనే విషయంలో జియో కస్టమర్లు అయోమయంలో పడ్డారు. ఇందుకోసం ప్రత్యేక టాప్ అప్‌లను ప్రకటించింది సంస్థ.
కాల్స్ కోసం రూ.10 నుంచి టాప్ అప్ ఓచర్లతో రీఛార్జ్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రతి రూ.10కి 1జీబీ చొప్పున డేటాను అదనంగా కేటాయిస్తామని తెలిపింది. ఒక నెట్వర్క్ చందాదార్లు వేరొక నెట్వర్క్ పరిధిలోని ఫోన్లకు కాల్స్ చేస్తే, కాల్ అందుకున్న నెట్‌వర్క్‌కు తొలి సంస్థ ఛార్జీ చెల్లించాలన్న (ఐయూసీ) ఆదేశాలు అమల్లో ఉన్నంత వరకు కాల్ ఛార్జీలు కొనసాగుతాయని స్పష్టం చేసింది జియో.
అందుబాటులో ఉన్న టాప్ అప్ ఓచర్ల వివరాలు...
టాప్ అప్ ఓచర్ ధర | నిమిషాలు (ఇతర నెట్‌వర్క్‌లకు) | ఉచిత డేటా (జీబీ) |
10 | 124 | 1 |
20 | 249 | 2 |
50 | 656 | 5 |
100 | 1,362 | 10 |
పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు..
పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు అంతర్జాలం నిలిపివేసిన క్రమంలో చేసే అవుట్ గోయింగ్ కాల్స్‌కు ఒక్కో నిమిషానికి 6 పైసలు వసూలు చేయనున్నారు. ప్రీపెయిడ్ కస్టమర్లకు అందిస్తున్నట్లుగానే ఛార్జీకి సమానంగా అదనపు డేటా లభించనుంది.
ఏమిటీ ఐయూసీ వ్యవహారం?
ఒక టెలికాం నెట్వర్క్ నుంచి మరో సంస్థకు కాల్స్ వెళ్తే, అనుసంధాన ఛార్జీ (ఐయూసీ) కింద మొదటి సంస్థ నిమిషానికి 14 పైసలు చెల్లించాల్సి వచ్చేది. 2017 అక్టోబర్ 1 నుంచి 2019 డిసెంబర్ 31 వరకు ఐయూసీ కింద నిమిషానికి 6 పైసలే వసూలు చేయాలని ట్రాయ్ నిర్ణయించింది. 2020 జనవరి 1 నుంచి ఐయూసీ ఛార్జీల వ్యవస్థే ఉండకూడదు. అప్పటి నుంచి నెట్‌వర్క్‌ల మధ్య వెళ్లే కాల్స్‌కు ఐయూసీ ఛార్జీల విధింపు ఉండకూడదు. కానీ ఐయూసీ ఛార్జీల వ్యవస్థ గడువు పొడిగించాలా, వద్దా అనే విషయమై ఒక చర్చాపత్రాన్ని ట్రాయ్ విడుదల చేసింది. ఈ అనిశ్చితి నేపథ్యంలో ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లే కాల్స్‌కు ఐయూసీ ఛార్జీలు వసూలు చేయాలని జియో నిర్ణయించింది.
ఇదీ చూడండి: రిలయన్స్ జియో షాక్: ఇకపై కాల్ ఛార్జీలు వసూలు