కుటుంబ వ్యాపారాలను శాశ్వతంగా, విజయవంతంగా కొనసాగించాలంటే నిపుణుల అండదండలు ముఖ్యమని అంతర్జాతీయ వాణిజ్య సలహాదారుడు, రచయిత డాక్టర్ రామ్‌చరణ్ అన్నారు. బలమైన, విలువ జోడించే డైరెక్టర్ల బోర్డు, సమర్థ సలహాదార్ల అవసరం ఎంతో ఉందని చెప్పారు. జీఎంఆర్ గ్రూపుల స్వచ్ఛంద సంస్థ అయిన జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్‌కు చెందిన పరంపర ఫ్యామిలీ బిజినెస్ ఇన్‌స్టిట్యూట్ (పీఎఫ్‌బిఐ) ఆధ్వరంలో కుటుంబ వ్యాపారాల తీరుతెన్నులపై ఆన్‌లైన్లో నిర్వహించిన ఏడో చర్చాగోష్ఠిలో ఆయన మాట్లాడారు.
ఆ విషయంలో కఠినత్వం తప్పనిసరి..
చాలామంది వ్యాపారవేత్తలు లోపలి నుంచి ఆలోచిస్తారని, ప్రణాళికల రూపకల్పనకు గతాన్ని పరిగణనలోకి తీసుకుంటారని.. దీనికి భిన్నంగా వెలుపల చూడటం, భవిష్యత్తును చూస్తూ ప్రణాళికలు నిర్దేశించుకోవడం ముఖ్యమని రామ్‌చరణ్ అభిప్రాయపడ్డారు. కుటుంబ సంస్థలు సీఈఓ ఎంపికలో కఠిన ప్రక్రియను అనుసరించాలని, వ్యక్తిగత ఇష్టానికి తావివ్వరాదని స్పష్టం చేశారు. డైరెక్టర్ల బోర్డు నిర్మాణంలోనూ విలువలు, సత్తా గల వారిని ఎంచుకోవాలని సూచించారు. కుటుంబ సంస్థల స్థాపకులకు ఉన్న ఆకాంక్ష, పట్టుదల.. తదుపరి తరాల వారిలో తగ్గిపోతూ వస్తుందని, అదే కుటుంబ సంస్థలకు నష్టం చేస్తోందని వివరిస్తూ, పట్టుదల- ఆకాంక్ష తగ్గకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం వ్యాపార కుటుంబాలకు ఉంటుందని చెప్పారు.
ఒక దుకాణంతో ప్రారంభించి ప్రపంచంలోనే అతిపెద్ద రిటైలర్‌గా ఎదిగిన శామ్ వాల్టన్ విజయగాథను ఉదహరించారు రామ్ చరణ్. కుటుంబ వ్యాపారాలు శాశ్వతత్వం కోసం, రిస్క్ తీసుకోవడం, సరైన మార్గనిర్దేశం చేసే వ్యక్తికి అధికారం ఇవ్వడం, ప్రభావవంతమైన ప్రక్రియలను అనుసరించడం అవసరమని వివరించారు. మార్పులకు తగ్గట్లుగా నిరంతరం మారుతూ ఉండాలని.. సాంకేతిక మార్పులు, ఉత్పాదకతలో కొత్తపోకడలు అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. మార్పులను అందిపుచ్చుకోవటంలోనే విజయాలు ఆధారపడి ఉంటాయన్నారు. ఈ చర్చాగోష్ఠికి ప్రసాద్ కుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఇదీ చదవండి: నెరవేరని 'ఒకే దేశం.. ఒకే పాలసీ' లక్ష్యం