కొవిడ్-19 వల్ల హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలకు చెందిన సిబ్బందిలో 90 శాతానికి పైగా ఇంటి నుంచి పని(వర్క్ ఫ్రమ్ హోమ్) చేస్తున్నారు. కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.. త్వరలో టీకా కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నెమ్మదిగా సాధారణ స్థితి నెలకొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో... ఐటీ సిబ్బందికి ఇంకా ఎంతకాలం 'ఇంటి నుంచి పని' అవకాశం లభిస్తుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇంటి నుంచి పనిచేయడంలో ఉన్న ఇబ్బందులు ఏమిటి? ఐటీ సంస్థల ఖాతాదారులు సంతోషంగా ఉన్నారా? ఉత్పాదకత ఎలా ఉంది? అనే అంశాలపై హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్(హైసియా) తాజాగా ఒక సర్వే నిర్వహించింది. 'రిటర్న్ టు ఆఫీస్' పేరుతో చేపట్టిన ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇప్పుడే కాదు
- ఐటీ సిబ్బంది ఇప్పటికిప్పుడే పూర్తి స్థాయిలో ఆఫీసులకు వెళ్లటం సాధ్యం కాకపోవచ్చు. ఈ ఏడాది మార్చి వరకు అయితే పెద్దగా మార్పు ఉండదు. ఆ తర్వాత కొద్ది మంది ఆఫీసులకు వెళ్లటం మొదలవుతుంది. సంవత్సరాంతానికి బాగా పెరుగుతుంది. కానీ నూరు శాతం ఆఫీసుకు వెళ్లి పనిచేయడం అనేడికపై దాదాపుగా ఉండదు.
- హైదరాబాద్‌కు వెలుపల తమ స్వస్థలాల నుంచి ఎక్కువమంది సిబ్బంది పనిచేస్తున్నట్లు పెద్ద ఐటీ కంపెనీలు స్పష్టం చేశాయి. వారంతా మళ్లీ ఇప్పటికిప్పుడు తమ కుటుంబాలతో పాటు నగరానికి రావడం సాధ్యం అయ్యే పని కాదు.
- 'ఇంటి నుంచి పని' జరుగుతున్నప్పటికీ ఉత్పాదకత ఎంతో అధికంగా ఉంది. సర్వేలో పాల్గొన్న దాదాపు 63% కంపెనీలు తమ సిబ్బంది ఉత్పాదకత 90 శాతానికి పైగా ఉన్నట్లు తెలిపాయి. కొన్ని పెద్ద కంపెనీల విషయంలో అయితే ఇది 100 శాతం ఉండటం గమనార్హం.
- సిబ్బంది మళ్లీ పూర్తిస్థాయిలో ఆఫీసులకు రావటం మొదలయితే, ఆఫీసు స్థలం మరింత అవసరమవుతుందని అనుకోవడం లేదని ఐటీ కంపెనీలు స్పష్టం చేశాయి. కొన్ని కంపెనీలు మాత్రం 10- 20 % అదనపు స్థలం అవసరం కావచ్చని పేర్కొన్నాయి.
ఎదురవుతున్న ఇబ్బందులు
- తగినంత బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ లేకపోవడం
- సైబర్ భద్రతా సమస్యలు
- ఇంట్లో అనుకూలమైన పనివాతావరణం లేకపోవటం
- కరెంటు కోతలు, తగిన సదుపాయాలు కొరవడటం వీటన్నింటిలో ఇంట్లో అనుకూల పనివాతావరణం లేకపోవడమే పెద్ద సమస్యగా ఎక్కువ కంపెనీలు భావిస్తున్నాయి.
స్వస్థలాలకు ఐటీ ఉద్యోగులు
ఐటీ సేవలు, ఉత్పత్తులు, ఐటీ ఆధారిత సేవలు అందించే దాదాపు 31 శాతం కంపెనీలకు చెందిన 20% సిబ్బందే ప్రస్తుతం ఆఫీసుల నుంచి పనిచేస్తున్నారు. 55 శాతం కంపెనీల సిబ్బందిలో 5% మాత్రం మాత్రమే ఆఫీసుకు వస్తున్నారు. కొన్ని పెద్ద కంపెనీల్లో ఆ మాత్రం కూడా ఆఫీసులకు రావటం లేదు. దాదాపు అందరూ ఇంటి నుంచే పనిచేస్తున్నారు. తమ సిబ్బందిలో 25% హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు వెళ్లిపోయి అక్కడి నుంచే పనిచేస్తున్నట్లు స్థానిక ఐటీ కంపెనీలు స్పష్టం చేశాయి.
ఆఫీసు స్థలం వదులుకోలేదు
సిబ్బంది ఇంటి నుంచి పనిచేస్తున్నప్పటికీ ఐటీ కంపెనీలు తమ ఆఫీసు స్థలాన్ని తగ్గించలేదు. దాదాపు 47% కంపెనీలు ఆఫీసు స్థలాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నాయి. 23% కంపెనీలు కొంత స్థలాన్ని, 6% కంపెనీలు పూర్తిగా ఆఫీసు స్థలాన్ని వదిలేసుకున్నాయి.
క్లయింట్లు అడిగితే
తమ క్లయింట్లు అడిగితే సిబ్బందిని ఆఫీసుకు పిలిచి పని చేయించాల్సి వస్తుందని కొన్ని భారీ ఐటీ కంపెనీలు తెలిపాయి. కొవిడ్-19 టీకా విడుదలై, ఆఫీసుకు వచ్చి పనిచేయడంలో ఇబ్బందులు పెద్దగా లేకపోతే, అప్పుడు సిబ్బందిని ఆఫీసుకు పిలుస్తామని మరికొన్ని కంపెనీలు తెలిపాయి.
ఆఫీసుకు రావటం అంటే... నేర్చుకోవడమే
ఐటీ సిబ్బంది పూర్తిస్థాయిలో ఆఫీసులకు వచ్చి పనిచేయటం ఇప్పట్లో కుదరదనే అభిప్రాయం ఐటీ వర్గాల్లో ఉన్నట్లు ఈ సర్వేలో స్పష్టమైందని హైసియా అధ్యక్షుడు భరణి కే.అరోల్ వివరించారు. ఇంటి నుంచి పనిచేయటంలోనూ కొన్ని సమస్యలు ఉన్నాయని అన్నారు. ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పరస్పరం కలవడం, మాట్లాడుకోవడం, నేర్చుకోవడం, ఆలోచనలు పంచుకోవటం అనేది లోపిస్తోందని వివరించారు. సిబ్బందితో ఆఫీసులోనే పనిచేయించి, తమ ప్రాజెక్టులు నిర్వహించాలని కొందరు క్లయింట్లు కోరుతున్న విషయం కూడా తెలిసిందన్నారు. ఆన్‌లైన్ సదుపాయాలు ఎంతగా అందుబాటులోకి వచ్చినా, స్వయంగా కలిసి మాట్లాడుకుని - పనిచేయడంలో ఉన్న సౌలభ్యం ఉండదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఒక్క మిస్డ్ కాల్‌తో ఎల్పీజీ సిలిండర్ బుకింగ్