Knight frank wealth report: దేశంలో అత్యంత ధనికులు అధికంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని 'నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్- 2022' వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం అత్యంత ధనికులను కలిగిన నగరాల్లో ముంబయి ప్రథమస్థానంలో ఉంది. 2021 ఏడాదిలో నికర ఆస్తి విలువ 30 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.227 కోట్లు) కంటే ఎక్కువగా ఉన్న వారిని 'అత్యంత ధనికులు' గా పరిగణనలోకి తీసుకున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. వీరు ముంబయిలో 1,596 మంది ఉండగా, హైదరాబాద్‌లో 467 మంది ఉన్నారు. హైదరాబాద్‌లో అత్యంత ధనికుల సంఖ్య 2026 నాటికి 728 కి పెరుగుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. గత అయిదేళ్లలో హైదరాబాద్‌లో అత్యంత ధనికుల సంఖ్య 314 నుంచి 48.7 శాతం పెరిగి, 467 కు చేరింంది. దేశవ్యాప్తంగా చూస్తే అత్యంత ధనికులు 2020లో 12,287 మంది ఉండగా, 2021లో ఆ సంఖ్య 13,637కు పెరిగింది. అంటే దాదాపు 11 శాతం వృద్ధి నమోదైంది. ఇక్కడి నుంచి 2026 నాటికి మనదేశంలో అత్యంత ధనికుల సంఖ్య 19,006 కు పెరిగే అవకాశం ఉందని నైట్ ఫ్రాంక్ నివేదిక అభిప్రాయపడింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 2020 లో 5.58 లక్షల మంది అత్యంత ధనికులు ఉండగా, 2021 నాటికి ఈ సంఖ్య 6.10 లక్షలకు పెరిగింది.
ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నారు?
- మనదేశంలో అత్యంత ధనవంతులు ఇళ్లు, వాణిజ్య భవనాలు, కార్యాలయ స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. ఈక్విటీల్లో, రీట్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు.
- తమ సొమ్ములో దాదాపు 60 శాతాన్ని స్థిరాస్తికే కేటాయిస్తున్నారు.
- ఇటీవల క్రిప్టో కరెన్సీ, ఎన్‌ఎఫ్‌టీ (నాన్-ఫంజిబుల్ టోకెన్స్) ల్లోనూ పెట్టుబడులు పెడుతున్నారు. వీరి పెట్టుబడుల్లో దాదాపు 20 శాతం క్రిప్టో కరెన్సీలో ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది.
- తమ అభిరుచులకు దాదాపు 11 శాతం సొమ్ము వెచ్చిస్తున్నారు. కళాఖండాలు, ఆభరణాలు, ఖరీదైన కార్లు, చేతి గడియారాలు, హ్యాండ్‌బ్యాగ్‌లు కొనుగోలు చేస్తున్నారు.
- ఇతర దేశాల్లోని ధనికులు కళాఖండాలు, ఖరీదైన కార్లు, ఆభరణాలు, వైన్, వాచీలు ఇష్టపడుతున్నారు.
ధనికుల సంఖ్య ఇంకా పెరుగుతుంది
స్టాక్‌మార్కెట్లు గణనీయంగా రాణించడం, డిజిటల్ టెక్నాలజీ విస్తరణతో భారతదేశంలో ధనికుల సంఖ్య పెరుగుతోందని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బజాజ్ అభిప్రాయపడ్డారు. యువకులు, స్వతంత్రంగా ఎదిగిన వారు పెద్దఎత్తున సంపద సృష్టిస్తున్నట్లు తెలిపారు. కొత్త వ్యాపార రంగాలు ఆవిర్భవించడం, అధికంగా పెట్టుబడులను ఆకర్షించడం కూడా దీనికి వీలుకల్పిస్తున్నట్లు వివరించారు. ఫలితంగా ధనికుల సంఖ్య వేగంగా పెరుగుతున్న దేశాల్లో భారతదేశం ఉంటుందని వెల్లడించారు.
ఇదీ చూడండి: