‘అమ్మాయిలకు టెక్నాలజీపై పెద్దగా అవగాహన ఉండదు’ అనే అపోహ ఇంకా ఎవరికైనా ఉంటే వాళ్లు దేవితా షరాఫ్ సాధించిన విజయం గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. స్మార్ట్‌టీవీల కంటే ఒక అడుగు ముందున్న ‘4కె ఇంటిలిజెంట్’ టీవీల తయారీని చేపట్టిన దేవిత చిన్నతనం నుంచీ ప్రయోగాలు చేయడంలో దిట్ట. ఆ తీరువల్లే గతేడాది ఫార్చూన్ శక్తివంతమైన మహిళల, తాజాగా హ్యూరన్ యువ శ్రీమంతుల జాబితాలో స్థానం దక్కించుకుంది.
24 ఏళ్లకే టీవీల తయారీలో...
జెనిత్ కంప్యూటర్స్ ఛైర్మన్ రాజ్‌కుమార్ షరాఫ్ కుమార్తె దేవిత. పుట్టింది ముంబయిలో. పదహారేళ్లకే జెనిత్‌లో ఉద్యోగిగా అడుగుపెట్టింది. మూసధోరణిని వ్యతిరేకించే దేవిత ప్రపంచాన్ని తెలుసుకోవడానికే అమెరికా వెళ్లానంటుంది. ‘జెనిత్‌లో మార్కెటింగ్, అకౌంట్స్... ఇలా పలువిభాగాల్లో పనిచేశా. కాలేజీ ఎగ్గొట్టి కూడా బిజినెస్ సమావేశాలకు హాజరయ్యేదాన్ని. చదువు విషయంలో నాకో అసంతృప్తి ఉండేది. క్లాసులో అందరూ ఒకేలా ఆలోచించాలనడం, ప్రశ్నించేవారిని వింతగా చూడ్డం అస్సలు నచ్చేది కాదు. కాస్త మార్పు ఉంటుందని అమెరికా వెళ్లి చదుకోవాలనుకున్నా. ముంబయిలో కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసిన తర్వాత... లాస్ ఏంజిలెస్‌లోని ‘సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ’ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి పీజీ చేశా. 22 ఏళ్లకే జెనిత్‌కి సీఈవో అయ్యా’ అని చెప్పే దేవిత 24 ఏళ్లకి సొంత సంస్థని మొదలుపెట్టింది.
కావాల్సినవే చూడొచ్చు...
తండ్రి నడుపుతున్న కంప్యూటర్స్ తయారీరంగం కాకుండా లగ్జరీ టీవీల తయారీ దేవితను ఆకర్షించింది. ‘కంప్యూటర్ టెక్నాలజీ గొప్పదే. కానీ సాయంత్రం అయితే టీవీలకు అతుక్కుపోని కుటుంబాలు ఉంటాయా చెప్పండి? అయితే ఇప్పటివరకూ మనం చూస్తున్న టీవీలు పాతతరానికి చెందినవే. టీవీలో వచ్చేవి మనం చూడ్డం కాకుండా... మనం చూడాలనుకున్నవి టీవీలో వస్తే బాగుంటుందని ఆలోచించా. పైగా ఈతరం టీనేజర్లని స్క్రీనేజర్లని పిలవొచ్చు. వాళ్లకి నేనందివ్వబోయే టీవీ ద్వారా మరిన్ని ప్రయోజనాలు ఉండాలనుకున్నా. నెట్‌తో కనెక్ట్ అవ్వడంతోపాటూ... ఒక కంప్యూటర్ చేసే పనులన్నీ దీంతో చేయాలనుకున్నా. ఈ ఫీచర్స్‌తోనే వీయూని రూపొందించాం’ అనే దేవిత సంస్థ ఉత్పత్తులని వేగంగానే మార్కెట్‌లోకి తీసుకెళ్లగలిగింది.
ఐక్యూ సొసైటీలో సభ్యురాలిగా...
‘స్కూల్ రోజుల్లో ఒక్కసారి కూడా నేను క్లాస్ టాపర్‌గా నిలవలేదు. ఏ పోటీలోనూ గెలిచి ఇంటికి బహుమతులు పట్టుకెళ్లలేదు. ఈ విషయంలో మా అమ్మానాన్న ఎప్పుడూ నన్నేమీ అనలేదు. చిన్నపుడు నేను మ్యాథ్స్‌లో పూర్. మా టీచర్ నా లెక్కల పుస్తకాన్ని చెక్ చేసి ‘నువ్విక్కడ కాదు... మెన్సా క్లబ్‌లో ఉండాల్సినదానివి’ అనేవారు వెటకారంగా. అప్పటికి నాకు ఆ క్లబ్ ఏంటో తెలీదు. లాస్ ఏంజిలెస్‌లోని హైఐక్యూ సొసైటీ అది. దీనికి శతాబ్దాల చరిత్ర ఉంది. అమెరికాలో ఉన్నప్పుడు... పరీక్షలు రాసి ఈ ప్రతిష్ఠాత్మక క్లబ్‌లో సభ్యురాలినయ్యా. ఈ మధ్య నేను చదువుకున్న క్వీన్‌మేరీ స్కూల్‌కే ముఖ్య అతిథిగా వెళ్లాను. అక్కడ మా టీచర్ కనబడి ‘ఆ దేవితవేనా?’ అని నవ్వుతూ, దగ్గరకు తీసుకున్నారు’ అంటూ తన బాల్యం గుర్తుచేసుకుంటుంది దేవిత. ఒత్తిడిని జయించడానికీ, మానసికంగా దృఢంగా ఉండటానికి ఒడిసీ నృత్యానికి మించిన దారిలేదు అంటుంది దేవిత. పదేళ్లుగా నాట్యాన్ని సాధన చేస్తున్న దేవిత... ఫార్ములా వన్ రేసర్ కూడా. హెయిర్ కట్స్‌తో ప్రయోగాలు చేయడమూ ఆమెకు ఇష్టమే.
మహిళలు ముందుకు రావాలి...
‘చాలామంది మహిళలు డబ్బు అవసరమైనప్పుడు మాత్రమే కెరీర్‌ని సీరియెస్‌గా తీసుకుంటారు. లేకపోతే కెరీర్ గురించి అంతగా పట్టించుకోరు. కానీ... వాళ్ల సామర్థ్యాన్ని నమ్మి ముందడుగు వేస్తే ఏ రంగంలోనైనా రాణిస్తున్నారు’ అనే దేవిత.. తాజాగా హ్యూరన్ ఇండియా సంస్థ ప్రకటించిన స్వశక్తితో ఎదిగిన 40 ఏళ్లలోపు సంపన్నుల జాబితాలో.. రూ.1200 కోట్ల సంపాదనతో 16వ స్థానంలో నిలిచి ఎందరికో స్ఫూర్తినిస్తోంది.
ఇదీ చదవండి: 'మనుషుల మాదిరి ఆలోచించే యంత్రాలకే డిమాండ్'