ఆర్థిక ప్రణాళికలో బంగారం కూడా భాగమే. అత్యవసర సమయంలో డబ్బు కావల్సి వచ్చినప్పడు బంగారం తాకట్టుపెట్టి రుణం తీసుకోవడం లేదా అమ్మడం చేస్తుంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక అవసరాల కోసం కొంత మంది బంగారాన్ని విక్రయించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే అమ్మే ముందు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి.
- విక్రయించే ముందు బంగారం బరువు, క్యారెట్(బంగారం స్వచ్ఛతను కొలిచే ప్రామాణికం)లను తెలుసుకోండి. కొనుగోలు చేసినప్పుడు ఇచ్చే రశీదులను భద్రపరుచుకోవడం మంచిది. ఇలాంటి సమయంలో ఉపయోగపడతాయి.
- రశీదులు లేకపోయినా ప్రస్తుతం ఉన్న బరువు, స్వచ్ఛతను పరీక్షించి రశీదు తీసుకోండి.
- ఒకే దుకాణంలో కాకుండా నాలుగైదు షాపులకు వెళ్లి కొటేషన్ తీసుకోండి. బంగారం ధరను నిర్ణయించేందుకు స్టాండర్డ్ విధానాలు లేవు. అందువల్ల వేర్వేరు దుకాణాల్లో కొటేషన్ తీసుకోమని చెబుతున్నారు నిపుణులు.
- అమ్మాలనుకుంటున్న బంగారం స్వచ్ఛత గురించి మీకు కచ్చితంగా తెలియకపోతే.. క్యారెట్ మీటర్ అందుబాటులో ఉన్న ఒకటి కంటే ఎక్కువ షాపుల వద్ద స్వచ్ఛతను పరీక్షించండి. బంగారు నగలపై ఉండే హాల్‌మార్కింగ్ గుర్తు దాని స్వచ్ఛతను తెలియజేస్తుంది. కొనుగోలుదారులు అటువంటి ఆభరణాలను కొనేందుకు ఆసక్తి చూపుతారు.
- ఆభరణాలు అమ్మాలన్నా, పాత నగలకు బదులుగా కొత్తవి తీసుకోవాలన్నా .. గతంలో ఆ ఆభరణాలను కొనుగోలు చేసిన దుకాణాన్ని ఎంచుకోవడం మంచిది. కొన్ని దుకాణాలు.. వారి వద్ద కొన్న బంగారాన్ని తిరిగి కొనుగోలు చేస్తాయి.
- చిన్న చిన్న దుకాణాలు, తెలియని వారు మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందువల్ల నమ్మకమైన దుకాణాల వద్ద గానీ, ప్రసిద్ధ బ్రాండ్ షాపులకు గానీ వెళ్లడం మంచిది.
- తుది ధర చెప్పే ముందు, ఆభరణాల బరువులో నిర్ణీత శాతాన్ని వేస్టేజ్ కింద తగ్గిస్తారు. అందువల్ల విక్రయించే ముందు ఎంత శాతం వెస్టేజ్ రూపంలో పోతుందో తెలుసుకోవాలి. కొంత మంది నగల మొత్తం బరువులో 20 శాతం వరకు వేస్టేజ్ కింద తీసివేసి ఆ మొత్తాన్ని తగ్గించి ఇస్తారు. రాళ్లు ఉన్న ఆభరణాలకు ఎక్కువ వేస్టేజ్ లెక్కిస్తారు.
- ఆభరణాలు కొనుగోలు చేసేప్పుడు మీరు చెల్లించిన తయారీ రుసుములు, విక్రయించేటప్పుడు తిరిగి రావు.
ఇవీ చదవండి: