ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బుతో ముడిపడి ఉన్న పనులు ఉంటాయి. అయితే మీ జీవితంలో ఆర్థిక అంశాలు సజావుగానే జరుగుతున్నాయా? లేదా? ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందా? అని తెలుసుకుందాం. ఈ కథనంలో కొన్ని ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. వీటిని తెలుసుకుంటే మీ ఆర్థిక జీవితం సజావుగా ఉంటుందని మా నమ్మకం.
చాలా సాధారణమైన, సులభమైన సూచిక ఏంటంటే ప్రతి నెల ఖర్చులు పోనూ కొంత డబ్బు మిగులుతుందా? లేదా? అనేది చూసుకోవాలి. ఆదాయంలో నుంచి ఖర్చులను తీసివేస్తే వచ్చే మొత్తం మీ వద్ద మిగిలిన డబ్బు. దీన్ని లెక్కించేందుకు పెద్ద శ్రమ పడనవసరం లేదు. అయితే కొంత డబ్బు మిగిలే స్థితిలో ఉండటం చాలా శుభ సూచికం. మీ ఆదాయంలో కనీసం 20-30 శాతం నికరంగా మిగల్చగల్గితే చాలు. ఉదాహరణకు మీ జీతం రూ.80 వేలు అనుకుందాం. అయితే మిగిలే మొత్తం నెలకు రూ.2-3 వేలు అయితే దాని అర్థం మంచి ప్రణాళిక ప్రకారం చేశారని కాదు. నెల పూర్తయ్యాక చేతిలో కనీసం రూ.15-20 వేలు ఉండాలి. దీన్ని చాలా ముఖ్యమైన అంశంగా మీరు పరిగణించాలి.
మీ నికర విలువ క్రమంగా పెరుగుతుందా లేదా?
ప్రతి ఏడాదికి మీ నికర విలువ పెరుగుతుండటం చాలా ముఖ్యం. ఎందుకంటే నికర విలువ మీ ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తుంది. దీన్ని ఎలా చూడాలంటే 5 ఏళ్ల క్రితం మీ నికర విలువ కంటే ప్రస్తుతం పెరిగిందా? 3 ఏళ్లు, 1 ఏడాది ఇలా గతంతో పోల్చుకుంటే మీ నికర విలువ పెరిగిందా? లేదా? అనేది చూసుకోవాలి.
నికర విలువ వృద్ధి చెందడంలో సంవత్సరం చొప్పున లెక్కేసుకోవాలి. ఒక ఏడాదిలో కొన్ని నెలలు తగ్గడం జరగొచ్చు. అంతమాత్రాన దాన్ని పరిగణించనవసరం లేదు. క్రమంగా ఏటా వృద్ధి చెందుతుందా లేదా అనేది సమీక్షించుకోవాలి. ముఖ్యంగా మీరు పదవీవిరమణ చేసే వయసు దగ్గర పడుతుంటే నికర విలువ పెరుగుతుండాలి. దీని ద్వారా భవిష్యత్తు కు భరోసా ఉంటుంది.
సాధారణంగా నికర విలువ పెరగడం అనేది రెండు కారణాల పై ఆధాపడుతుంది.
- మీరు చేసే పెట్టుబడులు సక్రమంగా వృద్ధి చెందడం. వాటి నుంచి లభించే రాబడి, వడ్డీ మొదలైన వాటి మూలంగా సంపద వృద్ధి చెందుతుంది.
- మీరు ప్రతి నెల చేసే పెట్టుబడులు. సాధారణంగా వాటి విలువ క్రమంగా వృద్ధి చెందుతుంటుంది. కాంపౌండింగ్ ప్రభావంతో మీ పెట్టుబడులు భవిష్యత్తులో మరింత వృద్ధి చెందేందుకు సహకరిస్తుంది.
రుణాలపై ఆధారపడటం తగదు…
3 నెలల పాటు క్రెడిట్ కార్డు వాడకూడదంటే మీరెలా స్పందిస్తారు. కొందరైతే చాలా ఆందోళన చెందుతారు. ఇది చాలా అవసరంగా మారిపోతుంది. క్రెడిట్ కార్డుపై ఆధారపడి ఉంటారు కానీ అది లేకపోతే పని జరగనంత స్థాయికి వెళ్లకపోవడం మంచిది. క్రెడిట్ కార్డుపై పూర్తిగా ఆధారపడటం, అవసరానికి వినియోగించడం రెండింటికీ చాలా తేడా ఉంది. క్రెడిట్ కార్డుతో పాటు ఇతర రుణాలపై ఆధారపడి ఉండేవారు అంటే అవసరాలకు డబ్బు అవసరం రావడం, వ్యక్తిగత రుణం తీసుకోవడం, ఈఎమ్ఐ చెల్లించేందుకు రుణం తీసుకోవడం మొదలైనవి. ఆర్థిక పరంగా చూస్తే ఇదంత మంచి పరిణామం కాదు. దీని ద్వారా సమయానికి చెల్లింపులు చేయకపోవడం, తద్వారా క్రెడిట్ నివేదికపై ప్రభావం చూపడం జరుగుతుంది. భవిష్యత్తులో రుణం తీసుకోవాలంటే అడ్డంకిగా మారవచ్చు.
ఊహించని సంఘటనలు ఎదురైనా…
జీవిత బీమా ఆరోగ్య బీమా పాలసీలు ఉన్నాయా? ఎందుకంటే దీని మూలంగా జీవితానికి రక్షణ పెరుగుతుంది. ఒక వ్యక్తి చాలా కాలంపాటు సంపాదించిన మొత్తంతో ఇంటి కొనుగోలుకు డౌన్ పేమెంట్ చేయాలని అనుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో అనారోగ్యమో లేక ప్రమాదమో జరిగి అతని సంపద మొత్తం ఆసుపత్రి ఛార్జీలకు పోతుంది. అప్పుడు ఏంటి పరిస్థితి? గృహానికి చెల్లించాల్సిన డౌన్ పేమెంట్ చెల్లించేదెలా? దీనికి ముందస్తు జాగ్రత అవసరం.
30-35 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి వార్షిక వేతనం రూ.10 లక్షలు అనుకుంటే అతనికి రూ.కోటి బీమా హామీకి జీవిత బీమా టర్మ్ పాలసీ, రూ. 5 లక్షలకు ఆరోగ్య బీమా పాలసీ ఏడాది ప్రీమియం రూ. 20,000తో లభిస్తుంది. అంటే మొత్తం ఆదాయంలో కేవలం రెండు శాతం ప్రీమియం చెల్లిస్తే భవిష్యత్తుకు భద్రత ఉంటుంది. గృహ రుణం తీసుకున్న వ్యక్తి ఏ విధమైన జీవిత బీమా పాలసీలు తీసుకోకపోతే దురదృష్టవశాత్తూ ఆయన దూరమైతే ఆ ఇంటి ఈఎమ్ఐల భారం కాస్త కుటుంబ సభ్యులపై పడుతుంది. అది మీ పై ఆధారపడి జీవించే వారి భద్రతను హరిస్తుంది.
అనుకోని ఖర్చులకు సిద్ధంగా ఉన్నారా?
జీవితం అంటేనే ఊహించలేనిది. అలాంటి జీవితంలో అకస్మాత్తుగా డబ్బు అవసరమవడాన్ని అసలే ఊహించగలమా? కనీసం రెండు నెలల జీతాన్ని ఏర్పాటు చేసుకోగల పరిస్థితిలో ఉన్నారా? దీని అర్థం పొదుపుఖాతాలో డబ్బు నిల్వ ఉంచమని కాదు. బయటి వారిపై ఆధారపడకుండా కనీసం రెండు నెలల జీతాన్ని సిధ్దం చేయగల స్థితిలో ఉండాలి, చాలా మందికి దీని దగ్గర సమాధనం లేదు అంటారు. ఎందుకంటే అప్పటికే వివిధ రకాల పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి చేస్తుంటే ఇంక మిగిలేది ఏంటి అంటుంటారు. నిజమే అయితే ఎంత పెట్టుబడి చేసినా, ఆ మాత్రం మొత్తాన్ని ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలి.
కనీసం 10 శాతం క్రమంగా మదుపు చేస్తున్నారా?
ఆర్థిక జీవితం సజావుగా ఉండాలనుకునే ప్రతి వ్యక్తి తన ఆదాయంలో కనీసం 10 శాతం క్రమంగా మదుపు చేయడం చాలా అవసరం. పెట్టుబడి చేసే అనుకూలతను బట్టి ఎంతైనా చేసుకోవచ్చు. అయితే అందరికీ వీలయ్యే విధంగా పది శాతం సూచించాం. ఉదాహరణకు ఒక వ్యక్తి నెలకు రూ.50వేలు సంపాదిస్తున్నారు అనుకుందాం. ఆయన కనీసం రూ.5 వేలు నెలకు మదుపు చేయగలగాలి. చాలా వరకు మదుపర్లు మ్యూచువల్ ఫండ్లను ఎంచుకుంటారు. అయితే ముందు ఒక రికరింగ్ డిపాజిట్ లో మదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. అలా ఏడాది తరువాత ఆ మొత్తాన్ని చూస్తే మీ సంపద ఎలా వృద్ధి చెందుతుందో చక్కగా అర్థమవుతుంది. ఇది మీ దీర్ఘకాల పెట్టుబడికి మంచి ప్రారంభంగా అవుతుంది.
ఈఎమ్ఐ చెల్లింపులు పరిమితిలో ఉండాలి…
మీరు ప్రతి నెలా చెల్లించే ఈఎమ్ఐలు, ఇతర చెల్లింపులు మీ వేతనంలో ఏ మాత్రం ఉన్నాయనేది కీలకం. ఉదాహరణకు రూ.లక్ష సంపాదించే వ్యక్తి నెలకు ఈఎమ్ఐలు, ఇతర చెల్లింపులకు రూ.72,000 వెచ్చిస్తున్నారు. మిగిలిన మొత్తంతోనే మిగిలిన ఖర్చులన్నీ చేయాల్సి ఉంటుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఏ సమస్య ఉండదు. వచ్చే ఆదాయం తగ్గితే చాలా ఇబ్బందులు పడాల్సిరావొచ్చు. చాలా మంది దంపతులు ఇద్దరూ ఉద్యోగం చేసే సమయంలో చేసిన ఖర్చులు, రుణాలు తాలుకా ఈఎమ్ఐలు కలిపి చెల్లిస్తుంటారు. భార్య సంతానం కలిగిందని ఉద్యోగం మానేయొచ్చు. అలాంటి సందర్భాల్లో ఈ చెల్లింపుల భారం వారిపై ఘోరంగా ఉంటుంది. ఇక్కడ వచ్చిన సమస్యేంటంటే భవిష్యత్తు చక్కగా ఉండాలనే అందరూ ప్లాన్ చేసుకుంటారు. కానీ మధ్యలో వచ్చే సమస్యలు వారిని రుణ వలయంలోకి నెట్టేస్తాయని గుర్తుంచుకోవాలి. అందుకే ఎవరైనా సరే రుణం తాలుకా ఈఎమ్ఐలు వారి ఆదాయంలో 40 శాతాన్ని మించకుండా ప్లాన్ చేసుకోవాలి.
రాబడి బాగుందా ?
మీరు ప్రతి నెలా చేసే పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్లు, ఫిక్సిడ్ డిపాజిట్లు తదితర పథకాలు అందించే రాబడి ఎలా ఉందనేది చూసుకోవాలి. ఉదాహరణకు ఫిక్సిడ్ డిపాజిట్‌పై వచ్చే వడ్డీ రేటు 8 శాతం గా ఉండొచ్చు. మీరు 30 శాతం పన్ను శ్లాబులో ఉన్నట్లయితే పన్ను చెల్లింపుల తర్వాత రాబడి సుమారు 5.5-6 శాతం ఉండొచ్చు. అదే సమయంలో ద్రవ్యోల్బణం 9 శాతం ఉంటే రాబడి బాగున్నట్లు కాదనే చెప్పాలి. నిజానికి ఎఫ్‌డీలో ఉంచిన డబ్బుపై రాబడి, చూసేందుకు రాబడిలా ఉన్నా పన్ను ద్రవ్యోల్బణం తరువాత అది నెగెటివ్ రేటుగా మారొచ్చు. ఇదెలా ఉంటుందంటే పక్కనే ఉన్న దుకాణంలో కిలో యాపిల్‌లు రూ.150 .అయితే ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరొక దుకాణంలో కిలో 135 పెట్టి కొనడం లాంటిది. అయితే ఆ దుకాణానికి వెళ్లేందుకు అయ్యే రవాణా లేదా డీజిల్ ఛార్జీలు 30-40 అవుతాయి. కాబట్టి అధిక పన్ను శ్లాబులో ఉన్నవారు సేవింగ్స్ ఖాతా, ఫిక్సిడ్ డిపాజిట్లలో ఉంచే మొత్తం తగ్గించి మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి చేయడం మంచిది.
ఇదీ చూడండి: 'పొదుపుపై అల్పాదాయ వర్గాలకు కావాలి భరోసా'