ఆర్థికమాంద్యం పరిస్థితులను అధిగమించేందుకు ఇప్పటికే పలు రంగాలకు ఉద్ధీపనలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా జీఎస్టీ పన్ను రేట్లను తగ్గించింది. గోవాలో జరిగిన 37వ జీఎస్టీ మండలిలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
సేవారంగానికి ఊతం
సేవారంగానికి ఊతమిచ్చే లక్ష్యంతో హోటల్ గదుల అద్దెలపై జీఎస్టీని తగ్గిస్తున్నట్లు ఆర్థకమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇది ఆతిథ్యం, పర్యాటక రంగాల పురోభివృద్ధికి దోహదం చేస్తుందని ఆమె అన్నారు.
- రూ.7,500 వరకు ఉండే హోటల్ గదుల అద్దెపై జీఎస్టీ రేటును 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు.
- రూ.7,500లకు పైగా ఉండే హోటల్ గదుల అద్దెపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి సవరించారు.
- రూ.1000 వరకు ఉండే హోటల్ గదుల అద్దెపై ఎలాంటి జీఎస్టీ విధించలేదు.
- ఔట్ డోర్ క్యాటరింగ్‌పై విధించే 18 శాతం పన్నును 5 శాతానికి తగ్గించారు.
చింతపండుకు టైమొచ్చింది
తాజా జీఎస్టీ మండలి సమావేశంలో చింతపండుపై విధిస్తున్న 5 శాతం జీఎస్టీని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. రాయితో కూడిన వైట్ గ్రైండర్లపై పన్నును 12 నుంచి 5 శాతానికి తగ్గించారు.
మంచి నిర్ణయం
జీఎస్టీ రేట్లు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం.. మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచుతుందని హోటల్ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇది ఆతిథ్య, పర్యాటక రంగాలకు చాలా ఉపకరిస్తుందని పేర్కొన్నారు. పండుగ సీజన్‌కు ముందు ప్రభుత్వం చేపట్టిన సానుకూల చర్యలు మార్కెట్‌ను లాభాలబాట పట్టిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: ''హౌదీ మోదీ'కి ముందు మార్కెట్ల జోరు అద్భుతమే'