గిఫ్ట్ కార్డులు, ఓచర్లపై జీఎస్టీ వర్తిస్తుందా అనే దానిపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ తమిళనాడులోని అప్పీలేట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఏఆర్) బెంచ్ స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అటువంటి వాటిపైనా తప్పక జీఎస్టీని వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆయా గిఫ్ట్ కార్డులు, ఓచర్లను ఉపయోగించుకునే సమయంలో మాత్రమే వస్తు, సేవల పన్ను వర్తిస్తుందని తీర్పులో పేర్కొంది.
గిఫ్ట్ కార్డులు, ఓచర్లపై 12 నుంచి 18 శాతం జీఎస్టీ వసూలు చేయాలంటూ తమిళనాడు అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కల్యాణ్ జ్యూవెలర్స్ ఇండియా అప్పీలేట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్‌ను ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన ఏఏఏఆర్ తాజా తీర్పుని వెలువరించింది.
ఏఏఆర్ ఇచ్చిన తీర్పును సవరిస్తూ.. ఓచర్లు సరఫరాపై కాకుండా వాటిని ఉపయోగించుకునేప్పుడు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని అప్పీలేట్ అథారిటీ స్పష్టం చేసింది. ఓచర్లను ద్రవ్యేతర రూపంగా పరిగణించాలని తీర్పులో పేర్కొంది.
ఇదీ చూడండి: 'భూమిని ప్లాట్లుగా విక్రయించినా.. జీఎస్టీ కట్టాల్సిందే'