టెలికాం సంస్థల సీఈవోలు, ప్రతినిధులతో తొలిసారి సమావేశమయ్యారు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఈ సందర్భంగా టెలికాం రంగంలో ఆరోగ్యకరమైన పోటీనే ప్రభుత్వం కోరుకుంటోందని ప్రకటించారు. అంతేగానీ ఏకచ్ఛత్రాధిపత్యాన్ని కాదని స్పష్టం చేశారు. వినియోగదారులకు అందించే సేవల్లో నాణ్యత పెంచే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. భారత 5జీ ప్రాజెక్టు, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంలో టెలికాం రంగం ప్రముఖ పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
భారతీ ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విట్టల్, వొడాఫోన్-ఐడియా సీఈవో బలేశ్ శర్మ, రిలయన్స్ జియో బోర్డు సభ్యులు మహేంద్ర నహట, బీఎస్ఎన్ఎస్ ఛైర్మన్ పీకే పుర్వార్లతో దాదాపు గంటపాటు సమావేశమయ్యారు కేంద్ర మంత్రి. టెలికాం వ్యాపారంలో నెలకొన్న సమస్యలను మంత్రికి విన్నవించారు దిగ్గజాలు. సుంకాల తగ్గింపు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విడుదల వంటి చర్యలతో టెలికాం విభాగానికి సర్కారు పూర్తి స్థాయి మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు మంత్రి.
"43 వేల గ్రామాలు నేటికీ టెలికాం సేవలకు దూరంగా ఉన్నాయి. ఏడాదిలోపు ఈ గ్రామాలకు సేవలు ప్రారంభించాలని కోరాం. నా విన్నపం మేరకు అందరికీ టెలికాం సేవలు అందిస్తామని అంగీకరించారు. సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీ కావాలి. అంతేకానీ ఎలాంటి ఏకచ్ఛత్రాధిపత్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహించదని వారికి స్పష్టం చేశాను. "
- రవిశంకర్ ప్రసాద్, సమాచార, ప్రసారాల శాఖ మంత్రి.
అప్పుల్లో టెలికాం సెక్టార్...
టెలికాం రంగంలో నెలకొన్న పోటీతో... సంస్థలు భారీగా అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. 2016లో వచ్చిన రిలయన్స్ జియో జీవితకాల ఉచిత కాల్స్, తక్కువ ధరకే డేటా అందించింది. ఫలితంగా విపరీతమైన పోటీ ఏర్పడింది. ఇతర సంస్థలు రేట్లు తగ్గించక తప్పలేదు. దాని ద్వారా లాభాల్లో కోతపడింది. జియోను తట్టుకునేందుకు కొన్ని సంస్థలు జట్టు కట్టాయి.