దేశంలోని పరిశ్రమలపై కరోనా ప్రభావానికి సంబంధించి త్వరలోనే పరిష్కార మార్గాన్ని ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పరిశ్రమ వర్గాలతో భేటీ అయిన ఆమె వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
"అన్ని సంబంధిత శాఖల కార్యదర్శులు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శితో కలిసి పరిశ్రమ వర్గాల సమస్యలపై చర్చిస్తారు. రేపు మధ్యాహ్నానికల్లా తమ ఆలోచనలతో వస్తారు.. వారితో మాట్లాడి సమస్యకు తగిన పరిష్కారంపై సమాలోచనలు చేస్తాం. తర్వాత ప్రధాని కార్యాలయంతో చర్చించి త్వరగా పరిష్కార మార్గాలను ప్రకటిస్తాం."
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం కారణంగా ధరలు పెరుగుదలకు సంబంధించి ఎలాంటి ఆందోళన అవసరంలేదని నిర్మల భరోసా ఇచ్చారు. ఔషధాలు, వైద్య పరికరాలు కొరత ఉన్నట్లు ఎలాంటి సమాచారం రాలేదని స్పష్టం చేశారు. కొన్ని వస్తువుల ఎగుమతులపై ఫార్మా సంస్థలు నిషేధం ఎత్తివేయాలని కోరుతున్నట్లు ఆమె తెలిపారు.