టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) ప్రస్తుత ఛైర్మన్ ఆర్ ఎస్ శర్మ పదవీ కాలం సెప్టెంబరు 30తో ముగియనుంది. కొత్త చీఫ్ నియామకం కోసం అధికారిక ప్రక్రియ ప్రారంభించింది కేంద్రం. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో తెలిపింది.
టెలికాం సంస్థల టారిఫ్‌లు, కనెక్షన్ ఛార్జీలు నిర్ణయించే కీలక అధికారం ట్రాయ్‌కు ఉంది. స్పెక్ట్రమ్ వంటి కీలక విషయాలు, టెలికాం రంగంలో సంస్కరణలు, విలీనాలు వంటి వాటిపై ట్రాయ్దే తుది నిర్ణయం.
టెలికాం, పారిశ్రామిక, ఆర్థిక, గణనశాస్త్రం, చట్ట నిర్వహణ రంగాల్లో వృత్తిపరమైన, ప్రత్యేక అనుభవం ఉన్నవారు ఈ పోస్టుకు అర్హులు. 65 ఏళ్ల లోపు వయసుండాలి. ప్రభుత్వ ఉద్యోగులలో కార్యదర్శి, అదనపు కార్యదర్శి స్థాయి బాధ్యతలు నిర్వర్తించిన వారికి మాాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. దరఖాస్తులతో పాటు ఇతరుల పేర్లను పరిగణలోకి తీసుకునే అధికారం నియామక కమిటీకి ఉంటుంది.
ట్రాయ్ ప్రస్తుత ఛైర్మన్ ఆర్ ఎస్ శర్మ 2015లో బాధ్యతలు చేపట్టారు. 2018 ఆగస్టులో ఆయనకే మళ్లీ అవకాశం ఇచ్చింది నియామక కమిటీ. సెప్టెంబరు 30 వరకు పదవీకాలాన్ని పొడిగించింది. ఆయనకు 65 ఏళ్లు వస్తున్న కారణంగా పదవీవిరమణ చేయనున్నారు.