కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులు విదేశాల్లో కలిగి ఉండే అక్రమాస్తులు, నల్లధనం కేసుల విచారణ కోసం ఆదాయ పన్ను శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది.
ద ఫారెన్ అసెట్ ఇన్వెస్టిగేషన్ యూనిట్స్(ఎఫ్ఏఐయూ)ను నెలకొల్పేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతేడాది నవంబర్‌లో ఆమోదం తెలిపినట్లు సీనియర్ అధికారి తెలిపారు. ఆదాయ పన్ను శాఖలోని 69మంది అధికారులను ప్రత్యేక విభాగానికి బదిలీ చేసినట్లు పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఐటీ శాఖకు చెందిన 14 ఇన్వెస్టిగేషన్ డెరెక్టరేట్లలో ఎఫ్ఏఐ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు.
పన్ను పారదర్శకత, మనీ లాండరింగ్, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం, పన్ను ఎగవేత వంటి అక్రమాలను నిలువరించేందుకు ప్రపంచ దేశాలు పరస్పరం పన్ను సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయని మరో అధికారి తెలిపారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్(ఓఈసీడీ) నిర్దేశించిన అంతర్జాతీయ ప్రోటోకాల్స్‌ను పాటిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: పన్నురేట్లను తగ్గిస్తేనే.. ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం!