ఆర్థిక మాంద్యం పొంచి ఉన్న వేళ గృహనిర్మాణ రంగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చేందుకు రూ.20 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.10 వేల కోట్లు సమకూర్చునుంది. దాదాపు అంతే మొత్తాన్ని బయటి పెట్టుబడిదారుల నుంచి సమకూర్చనున్నారు. ఎన్పీఏలు, ఎన్సీఎల్టీ ప్రొసీడింగ్స్ ప్రకారం దివాలా తీసినవి ఈ ఉద్దీపన ప్యాకేజీ పరిధిలోకి రావని స్పష్టం చేసింది.
"గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లను పూర్తిచేయడం కోసం ప్రభుత్వం రూ.10 వేల కోట్లు సమకూర్చుతుంది. దాదాపు అదే మొత్తాన్ని బయటి పెట్టుబడిదారుల నుంచి ఆశిస్తున్నాం. ఈ పథకం దిగువ, మధ్య తరగతి ఆదాయ గృహనిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది. "
- నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి
గృహ నిర్మాణ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ప్రకటించిన ఈ నిధిని.. నిపుణులు, మంత్రులు పర్యవేక్షిస్తారని నిర్మలా సీతారామన్ తెలిపారు. గృహ రుణాల వడ్డీ రేట్లు తగ్గించి... పదేళ్ల జీ-సెక్ దిగుబడితో అనుసంధానం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
హౌసింగ్ డెవలపర్లు విదేశీ నిధులు పొందే విషయంలో బాహ్య వాణిజ్య రుణాలు (ఈసీబీ) మార్గదర్శకాలు సరళీకరిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆర్బీఐతో సంప్రదించి, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద అర్హత గల గృహకొనుగోలుదారులకు ఆర్థిక సహాయం చేయడానికీ సహకరిస్తామని ఆమె స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు వరం..
"ఇళ్లకు ఉన్న డిమాండ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల వాటా ఎక్కువ. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు కొత్త ఇళ్లు కొనుక్కోవడానికి ప్రోత్సాహం అందిస్తాయి."
- నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి
ఇదీ చూడండి: ఎగుమతుల పెంపునకు 'నిర్మలమ్మ' వరం