తల్లిదండ్రుల అనుమతి లేకుండా చిన్నారుల సమాచారాన్ని అక్రమంగా సేకరించి... తన ఆధీనంలోని యూట్యూబ్‌తో పంచుకున్నట్లు గూగుల్ అంగీకరించింది. ఫెడరల్ ట్రేడ్ కమిషన్, న్యూయార్క్ అటార్నీ జనరల్ విధించిన 170 మిలియన్ డాలర్ల భారీ జరిమానా కట్టేందుకూ సిద్ధమైంది.
1998 చిల్డ్రన్ ఆన్లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్‌తో సంబంధం ఉన్న కేసుల్లో ఈ జరిమానా అత్యధికమని విశ్లేషకులు చెబుతున్నారు. 13 ఏళ్లలోపు చిన్నారుల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే ముందు తల్లిదండ్రుల సమ్మతి పొందాల్సి ఉంటుంది. అయితే ఈ నియమాలను గూగుల్ ఉల్లంఘించింది.
అక్రమ మార్గంలో..
బొమ్మల తయారీదారులు, యువ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రకటనలు రూపొందించే వారికి ఈ సమాచారాన్ని అమ్మడం ద్వారా గూగుల్ లాభం పొందిందని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ వెల్లడించింది.
సంస్కరణలు తేవాలి..
గూగుల్, యూట్యూబ్ తెలిసే చట్టవిరుద్ధంగా వ్యవహరించాయని న్యూయార్క్ అటార్నీ జనరల్ జేమ్స్ వెల్లడించారు. ఈ భారీ జరిమానాతోనైనా... యూట్యూబ్ వ్యాపార పద్ధతుల్లో భారీ సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి: నేడే ప్రతిష్ఠాత్మక 'జియో ఫైబర్' సేవలు ప్రారంభం