కరోనా కారణంగా ప్రతి రంగంలో మార్పులు జరుగుతున్నాయి. అన్ని డిజిటల్ వేదికగా కార్యకలాపాలు నిర్వహించాల్సిన పరిస్థితిని మహమ్మారి సృష్టించింది. కిరాణా వ్యాపారం నుంటి పెద్ద పెద్ద పరిశ్రమల వరకు డిజిటల్‌కు మారిపోతున్నాయి. బీమా రంగంలో ఇప్పటికే డిజిటల్ ప్రక్రియ ఉన్నప్పటికీ కేవైసీ లాంటివి భౌతికంగా జరగాల్సి ఉండేవి. ఇప్పుడు ఆ ప్రక్రియ కూడా డిజిటల్‌కు మారిపోయింది.
బీమా తీసుకునే సమయంలో చేయాల్సిన కేవైసీ ప్రక్రియను వీడియో ఆధారంగా చేసుకోవచ్చని బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్‌డీఏఐ) అనుమతిచ్చింది. కొంత కాలం క్రితం ఆర్బీఐ అనుమతించటంతో.. ఇప్పటికే బ్యాంకులు, ఆర్థిక పరమైన సంస్థలు వీడియో కేవైసీని ఉపయోగిస్తున్నాయి.
వీడియో కేవైసీకి సంబంధించి బీమా సంస్థలకు.. యాప్‌లు, కేవైసీ చేసే ప్రతినిధులు తదితర మౌలిక సదుపాయాలు అవసరం అవుతాయి.
"వీడియో కేవైసీ విధానం కింద వినియోగదారులు తమ ఇళ్ల నుంచే సులభంగా పాలసీని కొనుగోలు చేయవచ్చు. లాక్డౌన్, సామాజిక దూరం పాటించాల్సిన ఈ సమయంలో వినియోగదారుల సౌలభ్యాన్ని, కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ఈ విధానం బీమా సంస్థలకు సహాయపడుతుంది. ఈ విధానం ద్వారా ఆన్లైన్ లో ఆధార్‌ను ఉపయోగించి కేవైసీ ధ్రువీకరణ ప్రక్రియ తక్షణమే పూర్తి చేయవచ్చు. ప్రస్తుత పరిస్థితిని గమనించినట్లైతే.. ఈ సదుపాయాన్ని సరైన సమయంలో ప్రవేశపెట్టారు. పాలసీ కొనుగోలుకు వినియోగదారుడు ఏజెంట్లను కలిసే అవసరం లేదు. మొత్తం డిజిటల్ గానే పాలసీ కొనుగోలు, కేవైసీ, పాలసీ పత్రాలను పొందటం వంటివి చేయవచ్చు.”
- నవల్ గోయల్,సీఈఓ, పాలసీ ఎక్స్
ఎలా పనిచేస్తుంది?
ఐఆర్‌డీఏఐ నిబంధనల ప్రకారం వీడియో కేవైసీ చేస్తున్న కంపెనీ ప్రతినిధి వినియోగదారుడి వీడియో, ఫోటోలు తీసుకుంటారు. ఆధార్ కార్డు ద్వారా గుర్తింపునకు సంబంధించిన ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది. పాలసీదారుడు భారతదేశంలో ఉంటున్నాడన్న విషయాన్ని నిర్ధరించుకునేందుకు.. జీపీఎస్ ద్వారా వినియోగదారుడి లొకేషన్ తీసుకుంటారు.
ఆధార్ కార్డులో ఉన్న ఫొటో, గుర్తింపు వివరాలు వీడియోలో ఉన్న వారు ఒక్కరేనా? కాదా? అన్నదానిని కంపెనీ ప్రతినిధి చెక్ చేసుకుంటారు. వీడియో ముందే రికార్డు చేసింది కాదు, ప్రత్యక్షంగా తీసిందని తెలిసేందుకు వీలుగా.. కొన్ని ప్రశ్నలను కంపెనీ ప్రతినిధి అడుగుతారు. కేవైసీలో భాగంగా కంపెనీ ప్రతినిధి ప్రశ్నలు అడుగుతారు.
భద్రత అంశాలు..
వీడియో రికార్డింగ్‌పై తేదీ, సమయం స్టాంప్ ఉండేలా బీమా కంపెనీ చూసుకుంటుంది. ఈ వీడియోను నిబంధనలకు లోబడి భద్రపరుస్తారు. పూర్తి భద్రతతో కూడుకున్న సురక్షితమైన వీడియో కేవైసీ కోసం ఈ వ్యవస్థను ప్రవేశపెట్టే ముందు దానికి సంబంధించిన అప్లికేషన్‌ను సెక్యూరిటీ ఆడిట్ చేస్తారు.
వీడియో కేవైసీని.. థర్డ్ పార్టీ సేవలందించే వారికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఇచ్చేందుకు వీలు లేదు. శిక్షణ పొందిన, అనుమతి ఉన్న వారు మాత్రమే ఈ వీడియో కేవైసీని చేయాలి. కేవైసీ చేస్తున్న వారి వివరాలతో పాటు యాక్టివీటి లాగ్‌ను కంపెనీ వద్ద ఉంచుకోవాలి.
నిబంధనలు సడలింపు…
కొవిడ్ కారణంగా భౌతికంగా దరఖాస్తు ఫారమ్‌ను నింపటం, సంతకం చేయటంతో పాటు ఆ కాగితాలను ఒకరి నుంచి ఒకరికి పంపటం లాంటివి కష్టమైపోయాయి. దీనితో డిసెంబర్ వరకు కాగితాలపై సంతకం అవసరం లేకుండానే కస్టమర్ల అంగీకారాన్ని తీసుకోవచ్చని జీవిత బీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ అనుమతిచ్చింది.
కస్టమర్లకు ప్రపోజల్ ఫారమ్ ఆన్‌లైన్‌లో పంపవచ్చు. దీనికోసం ఈ-మెయిల్, మెసేజ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. వినియోగదారుడు అంగీకారం తెలిపేందుకు అందులో ఉన్న లింక్‌పై క్లిక్ చేసి వన్ టైమ్ పాస్‌వర్డ్ ఇస్తే సరిపోతుంది. ప్రపోజళ్ల కంటే ముందే వెరిఫికేషన్ కోసం కంపెనీలు ఫోన్ కాల్స్‌ను ఉపయోగించుకోవచ్చు.
కరోనా కారణంగా పాలసీకి సంబంధించి డాక్యుమెంట్లను పాలసీదారులకు పంపించటంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ-మెయిల్ ద్వారా పాలసీలు ఇచ్చేందుకు ఐఆర్‌డీఏఐ అనుమతిచ్చింది.