ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. ప్రధాని ప్రకటనే తనను నిర్దోషి అని అంటోందని ఉటంకించారు. భాజపా పాలనలో తాను ఓ పోస్టర్ బాయ్‌గా మారానని అభివర్ణించారు.
ఇటీవల రూ. 14,000 కోట్ల విలువైన విజయ్ మాల్యా ఆస్తులను ప్రపంచ వ్యాప్తంగా జప్తు చేసినట్టు ఓ ఇంటర్వ్యూలో ప్రధాన మంత్రి మోదీ వెల్లడించారు. మాల్యా చెల్లించాల్సిన దానికంటే ఎక్కువగానే తిరిగి రాబట్టామని... దీంతో మాల్యా ఇబ్బందుల్లో పడ్డారని అన్నారు.
ఈ అంశంపై తనదైన శైలిలో ట్విట్టర్లో పోస్ట్ చేశారు విజయ్ మాల్యా.
"నేను నమ్రతగా నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాను. బ్యాంకులకు నేను చెల్లించాల్సిన రూ.9,000 కోట్ల కంటే ఎక్కువగానే తమ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని... ప్రధాన మంత్రే ప్రకటించారు"
-ట్విట్టర్లో విజయ్ మాల్యా
నేను 1992 నుంచి బ్రిటన్ వాసిగా ఉన్న విషయం వాస్తవం. కానీ నేను పారిపోయానని భాజపా తప్పుడు అభియోగాలు మోపుతోందని మాల్యా పేర్కొన్నారు.