గత రెండు నెలలుగా.. పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. అయితే ఇప్పుడు ధరల బాదుడు నుంచి వారికి కాస్త ఉపశమనం లభించొచ్చని అంచనాలు వస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పెట్టడం వల్ల దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గొచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ముడి చమురు ధరలు ఇలా..
ఉత్పత్తి పరిమితులు, పెరిగిన డిమాండ్ వల్ల.. గత నెలలో బ్యారెల్ ముడి చమురు ధర 77 డాలర్లకు చేరింది. అయితే ఇటీవల ఇది దాదాపు 10 శాతం క్షీణంచి.. 68.85 డాలర్లకు దిగొచ్చింది. ఇంకొన్ని రోజులు ముడి చమురు ధర బ్యారెల్కు 70 డాలర్ల దిగువనే కొనసాగితే.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా త్వరలో తగ్గొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
అంతర్జాతీయంగా తగ్గిన ముడి చమురు ధరల ప్రభావం దేశీయంగా ఇప్పటికే కనిపిస్తోంది. వరుసగా నాలుగో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను యథాతథంగా ఉన్నాయి. ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు లేకుండా ఇన్ని రోజులు ఉండంట.. గత రెండు నెలల్లో ఇదే ప్రథమం.
బుధవారం నాటి లెక్కల ప్రకారం.. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.84 వద్ద, లీటర్ డీజిల్ ధర రూ.89.87 వద్ద ఉన్నాయి.
ముంబయిలో పెట్రోల్ రూ.107.83 (లీటర్కు), లీటర్ డీజిల్ ధర రూ.97.45 వద్ద కొనసాగుతున్నాయి. మెట్రో నగరాల్లో ముంబయిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ఇలా..
దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజు ఉదయాన్నే సవరిస్తుంటాయి చమురు మార్కెటింగ్ సంస్థలు(ఓఎంసీ). అంతర్జాతీయంగా అంతకు 15 రోజుల ముందు ఉన్న ముడి చమురు ధరలకు అనుగుణంగా ఈ ధరల్లో మార్పులు ఉంటాయి. దీని ప్రకారం.. తగ్గిన ముడి చమురు ధరల సైకిల్ 15 రోజుల ముగిసిన తర్వాత.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు దిగొచ్చే అవకాశం ఉంది.
ముడి చమురు ధరలు తగ్గేందుకు కారణాలు?
ఆగస్టు నుంచి చమురు ఉత్పత్తి పెంచేందుకు ఒపెక్, అనుబంధ దేశాలు ఆదివారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ విషయంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియా మధ్య ఏర్పడిన పొరపొచ్చాలకు తెరదింపుతూ ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పదం ప్రకారం.. ఆగస్టు నుంచి డిసెంబరు వరకు రోజుకు 20 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంచనున్నారు. దీనితో ముడి చమురు లభ్యత పెరిగి.. ధరలు కాస్త దిగొచ్చే అవకాశముంది.
ఇదీ చదవండి:ఆ సంస్థలో చేరితే.. 'వర్క్ ఫ్రం దుబాయ్- బీఎండబ్ల్యూ బైక్'