దేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి నిధుల సమీకరణలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ 6 లక్షల కోట్ల రూపాయల జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్(ఎన్ఎంపీ)ని విడుదల చేశారు. ఈ కార్యక్రమం కింద విద్యుత్ రంగం నుంచి రోడ్లు, రైల్వే శాఖ వద్ద నిరుపయోగంగా ఉన్న భూములను అభివృద్ధి చేసి నిధుల సమీకరించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం కొత్తగా భూములు సమీకరించేది లేదన్న నిర్మలా... బ్రౌన్‌ఫీల్డ్ ఆస్తులనే ఈ కార్యక్రమం కోసం వినియోగిస్తామన్నారు. ఇదే సమయంలో కేంద్రం భూములు అమ్ముతోందంటూ ఎవరికైనా అనుమానాలు ఉంటే వాటిని విడిచి పెట్టాలని చెప్పారు.
వివిధ రంగాల నుంచి అభివృద్ధి ప్రాజెక్టులను నిర్దేశించుకొని అందులో ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యం కింద ఎన్ఎంపీని చేపట్టనున్నట్లు వివరించారు. ప్రైవేటు సంస్థలు నిర్దేశించిన గడువు మీరిన తర్వాత తిరిగి ఆస్తులను ప్రభుత్వపరం చేయాలని మంత్రి పేర్కొన్నారు. 2022 నుంచి 2025 వరకు నాలుగేళ్ల వ్యవధిలో చేపట్టబోయే ప్రాజెక్టుల కోసం ఈ 6 లక్షల కోట్లు సమీకరించనున్నట్లు వివరించారు. ఆస్తులపై ప్రభుత్వానికే యాజమాన్య హక్కులు ఉంటాయని తెలిపారు. ఎన్ఎంపీ ద్వారా నిరుపయోగంగా ఉన్న ఆస్తుల విలువ పెరుగుతుందని.. తద్వారా భారత ఆర్థిక వ్యవస్థలోకి నగదు మరింతగా వచ్చి చేరి ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుందని చెప్పారు. కరోనా రెండోదశ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రప్రభావం చూపినప్పటికీ మౌలికవసతుల ప్రాజెక్టులు నిలిచిపోకూడదనే జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్ తెచ్చినట్లు వివరించారు.
"కొత్తగా భూమి సమీకరించబోయేదేమీ లేదు. మొత్తం జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్ మొత్తం బ్రౌన్‌ఫీల్డ్ ఆస్తుల ద్వారా జరుగుతుంది. ప్రైవేటు భాగస్వామ్యాన్ని తీసుకురావడం ద్వారా వాటిని మరింత సమర్థంగా ద్రవ్యరూపంలోకి మార్చవచ్చు. అలా వచ్చిన మొత్తాన్ని మౌలికవసతుల కల్పన రంగంలో పెట్టుబడిగా పెట్టడం జరుగుతుంది. మేము (కేంద్రం) భూములు అమ్మేస్తున్నామంటూ ఎవరి మెదళ్లలోనైనా సందేహం ఉంటే దాన్ని తొలగించండి. ఈ జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్ మొత్తం బ్రౌన్ ఫీల్డ్ ఆస్తుల ద్వారానే జరుగుతుంది. ఆ ఆస్తులపై యాజమాన్య హక్కులు కేంద్రం వద్దే ఉంటాయి. కొంత సమయం తర్వాత ఆ ఆస్తులను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలి."
-నిర్మలాసీతారామన్, కేంద్ర ఆర్థికమంత్రి
జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్ కార్యక్రమానికి సంబంధించి నీతి ఆయోగ్ ఆయా మంత్రిత్వ శాఖల్లో ఉన్న మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించిన నివేదిక సిద్ధం చేస్తున్నట్లు నిర్మల చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మొత్తంగా 43 లక్షల కోట్ల రూపాయల మేర మౌలికవసతుల కల్పన కోసం వెచ్చించాలని లక్ష్యంగా పెట్టుకోగా వచ్చే నాలుగేళ్లలో ఇందులో 6 లక్షల కోట్లు ఖర్చు చేయనుందని తెలిపారు. ఎన్ఎంపీ ద్వారా ప్రజల సామాజిక- ఆర్థిక స్థితిగతులతో పాటు జీవనప్రమాణాలు మెరుగవుతాయని మంత్రి వివరించారు.
ఇదీ చూడండి: LIC IPO: ఎల్ఐసీ ఐపీఓ నిర్వహణ రేసులో 16 బ్యాంకులు