Financial Changes 2022: వచ్చేఏడాది నుంచి కొన్ని ఆర్థిక నిబంధనల్లో మార్పులు రానున్నాయి. ముఖ్యంగా ఏటీం నుంచి డబ్బు తీస్తే అదనపు ఛార్జీలు, ఐపీపీబీ ఖాతాదారులు పరిమితికి మించి డబ్బు విత్‌డ్రా చేసుకుంటే అదనపు ఛార్జీల భారం పడుతుంది. ఇలా పలు విషయాల్లో మార్పులు జరుగుతాయి. అవేంటో ఓ లుక్కేద్దాం.
ప్రియం: ఏటీఎం నుంచి డబ్బు తీస్తే..
రేపటి నుంచి ఏటీఎం నుంచి నగదును తీసుకునేందుకు కాస్త అదనపు ఛార్జీలు చెల్లించాల్సి రావొచ్చు. ఇప్పటికే తమ బ్యాంకుల నుంచి వినియోగదార్లకు ఈ విషయంలో సందేశాలూ వచ్చాయి. ప్రస్తుతం నెలవారీ ఉచిత విత్‌డ్రా పరిమితి పూర్తయితే వినియోగదారులు ఒక్కో లావాదేవీకి రూ.20 చెల్లిస్తున్నారు. ఇకపై దీనికి మరో రూ.1 అదనంగా చెల్లించాల్సి వస్తుంది.
అధికం: పోస్టాఫీసు డిపాజిట్లపై ఛార్జీలు
జనవరి 1, 2022 నుంచి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఖాతాదారులు ఎక్కువ ఛార్జీలు కట్టాల్సి రావొచ్చు. తమ ఖాతాల నుంచి నిర్దిష్ట పరిమితికి మించి నగదును విత్‌డ్రా చేసుకుంటే ఈ అదనపు ఛార్జీల భారం పడుతుంది. 2021 మొదట్లోనే ఈ కొత్త నిబంధనను నోటిఫై చేశారు. నగదు డిపాజిట్ ఛార్జీలు సైతం మారనున్నట్లు తన వెబ్‌సైట్‌లో పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో మొత్తం మూడు రకాల సేవింగ్స్ ఖాతాలు (రెగ్యులర్, డిజిటల్, బేసిక్) ఉన్న సంగతి విదితమే.
భద్రం: బ్యాంకు లాకర్లు
ఆర్‌బీఐ తాజాగా జారీ చేసిన నిబంధనల ప్రకారం.. జనవరి 2022 నుంచి మీ బ్యాంకు లాకర్లు మరింత భద్రంగా మారనున్నాయి. బ్యాంకు నిర్లక్ష్యం కారణంగా వినియోగదారు లాకరుకు ఏదైనా హాని జరిగితే ఆ లాకర్ బాధ్యత నుంచి బ్యాంకులు తప్పించుకోలేవు. బ్యాంకు ప్రాంగణంలో ఉన్న లాకర్లకు భద్రతను ఇవ్వడానికి అన్ని రకాల చర్యలూ తీసుకోవడం వాటి బాధ్యతే. అగ్ని, దొంగతనం, దోపిడీ, భవనం కూలడం వంటివి జరిగితే అందుకు బాధ్యత బ్యాంకులదే. బ్యాంకు ఉద్యోగులు మోసాలకు పాల్పడిన సందర్భాల్లో, పైన పేర్కొన్న సంఘటనలు జరిగిన సమయాల్లో లాకర్లలోని వస్తువులకు తాము బాధ్యులం కాదు అంటూ ఇన్నాళ్లూ బ్యాంకులు చెబుతూ వచ్చాయి. అయితే ఇకపై పైన పేర్కొన్న అన్ని సందర్భాల్లోనూ సేఫ్ డిపాజిట్ లాకర్‌కు చెందిన వార్షిక అద్దెకు 100 రెట్లకు సమానమైన మొత్తానికి బ్యాంకులు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
నూతనం: ఫండ్ లావాదేవీలకు యాప్
మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్‌కు సంబంధించిన సేవలను సరళీకరించడానికి కేఫిన్‌టెక్, కంప్యూటర్ ఏజ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (కామ్స్)ల ఆధ్వర్యంలో ఎమ్‌ఎఫ్ సెంట్రల్ అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం ఏర్పాటైంది. ఈ ఏడాది చివరికల్లా ఫండ్ లావాదేవీల కోసం ఒక ప్లాట్‌ఫాంతో ముందుకు రావాలని రిజిస్ట్రార్, బదిలీ ఏజెంట్ల(ఆర్‌టీఏ)కు సెబీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సెప్టెంబరులో ఈ యాప్ వచ్చింది. అయితే తొలి దశలో బ్యాంకు ఖాతా, మొబైల్ నంబరు, ఇ-మెయిల్, నామినేషన్లు తదితర మార్పులను చేపట్టడానికి వీలు కల్పించారు. రెండో దశను ఇంకా ప్రారంభించలేదు. లావాదేవీలను ఇందులో నుంచే జరిపేందుకు ఇంకా అవకాశం రాలేదు. ఈ సేవలు కొత్త ఏడాదిలో అందుబాటులోకి రావొచ్చు.
ఇదీ చూడండి: రూ.75,00,000 కోట్లు.. ఏడాదిలో పెరిగిన మదుపర్ల సంపద