పెద్ద నోట్ల రద్దు సమయంలో భారీ మొత్తాలు డిపాజిట్ చేసిన బంగారు ఆభరణాల వ్యాపారుల లావాదేవీలపై ఆర్థిక శాఖ నిశిత పరిశీలన ప్రారంభించింది. అప్పటి గణాంకాలను డేటా అనలిటిక్స్ ద్వారా విశ్లేషించినపుడు, సదరు వ్యాపారుల ఆదాయానికి, చేసిన డిపాజిట్లకు పొంతనే లేదని గుర్తించారు.
పైగా సదరు వ్యాపారులు 2017-18 మదింపు సంవత్సర ఆదాయపు పన్ను రిటర్నులలో డిపాజిట్ చేసిన భారీ మొత్తాలను చూపలేదనీ సమాచారం. ఈ కారణంగా సమగ్ర విచారణకు మంత్రిత్వశాఖ ఆదేశించింది.
93,648 శాతం అధికం
పెద్దనోట్ల రద్దు అనంతరం అత్యంత అధిక మొత్తాల్లో డిపాజిట్ చేసిన కొందరు ఆభరణాల విక్రేతల కేసులను ఆదాయపు పన్ను విభాగం పునఃపరిశీలన (స్క్రూటినీ)కు ఎంచుకుంది. ఆ ఏడాదిలో పూచీకత్తు లేని రుణాలు భారీగా పెరగడానికి తోడు, రుణాల రద్దు కూడా ఎక్కువగా జరిగిందని గుర్తించింది.
డిపాజిట్ చేసిన మొత్తం విక్రయాలపై వచ్చిన నగదుగా వ్యాపారులు పేర్కొందామనుకున్నా, అంతకుముందు ఏడాదికి, 2016 నవంబరు 9 - డిసెంబరు 31 మధ్య జమ చేసిన మొత్తాల్లో తేడా అత్యంత భారీగా ఉందని గుర్తించారు.
- గుజరాత్‌కు చెందిన ఒక వ్యాపారి అయితే 2016 చివరి 2 నెలల్లో రూ.4.14 కోట్లు డిపాజిట్ చేశారు. 2015 ఇదే కాలంలో ఆయన డిపాజిట్ చేసిన మొత్తం రూ.44,260 మాత్రమే. అంటే ఏడాదిలో 93,648 శాతం అధికంగా చేశారు.
- వార్షిక సంపాదన రూ.5 లక్షలుగా చూపిన కొందరు ఆభరణాల విక్రేతలు, కోట్ల రూపాయలను 2-3 రోజుల్లో ఎలా డిపాజిట్ చేశారో విచారించబోతోంది.
- వార్షిక సంపాదన రూ.1.16 లక్షలుగా పేర్కొన్న ఒక వ్యాపారి, 3 రోజుల్లో రూ.4.13 కోట్లు; రూ.2.66 లక్షల ఆర్జన కలిగిన మరో వ్యాపారి రూ.3.28 కోట్లు; రూ.5.47 లక్షల వార్షికాదాయం ఉన్న ఇంకో వ్యాపారి రూ.2.57 కోట్లు 2 రోజుల్లోనే జమ చేశారని గుర్తించారు. ఏడాదికి రూ.64,550 మాత్రమే సంపాదిస్తున్న ఒక వ్యాపారైతే, ఈ సమయంలోనే రూ.72 లక్షలు డిపాజిట్ చేశారు.
- రూ.3.23 కోట్ల సంపాదన కలిగిన మరో వ్యాపారి ఏకంగా రూ.52.26 కోట్ల నగదు బ్యాంకులో వేశారు. 2015 నవంబరు 9న ఆయన వద్ద రూ.2.64 లక్షల నగదు ఉండగా, 2016 నవంబరు 9న ఏకంగా రూ.6.22 కోట్లు చూపారు. అంటే హ్యాండ్‌క్యాష్ రూపేణ 23,490 శాతం అధికంగా ఉంది. దీనికి అతని నుంచి సంతృప్తికర వివరణ కూడా రాలేదు.
అడ్వాన్సులు తీసుకున్నట్లు..
గుర్తు తెలియని ఖాతాదారుల నుంచి ఆభరణాల కోసం రూ.20,000 కంటే తక్కువగా అడ్వాన్సు రూపంలో తీసుకున్నట్లు పలువురు చూపి, బ్యాంకులో జమచేశారు. తదుపరి అంతే మొత్తాన్ని వారికి వాపసు ఇచ్చేసినట్లు తెలిపారు. ఆసక్తికర మరో అంశం ఏమిటంటే, ఆడిట్ నివేదికను 3సీబీ పత్రంతో కలిపి అప్‌లోడ్ చేసేప్పుడు, తమ సొంత సంస్థ లాభాలు, నష్టాలు కాక, వేరే సంస్థది నమోదు చేసినట్లు గుర్తించారు.