వస్తు, సేవల పన్ను జీఎస్టీ రేట్ల పెంపుపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. జీఎస్టీ రేట్లను పెంచనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆర్థికమంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
దిల్లీలో ఓ జాతీయ మీడియా నిర్వహించిన సదస్సులో పాల్గొన్న నిర్మలా సీతారామన్ .. జీడీపీ వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్ఠస్థాయికి పతనమైందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థికవ్యవస్థ పుంజుకునేందుకు మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పలు ఉద్దీపన పథకాలు అమలు చేసినట్లు పేర్కొన్నారు. ఫలితంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు గత రెండు నెలల్లో దాదాపు 5 లక్షల కోట్ల మేర రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునేందుకు తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు నిర్మలా సీతారామన్ వివరించారు.
ఇదీ చూడండి: ఉత్తర్ప్రదేశ్లో మహిళలకు చోటేది: ప్రియాంక గాంధీ