వ్యాక్సిన్లపై దుష్ప్రచారం చేసే ప్రకటనలు, ప్రజలను తప్పుదోవ పట్టించే యాడ్లను నిషేధిస్తూ సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో ప్రభుత్వ ప్రకటనలు, పోస్టులకు మినహాయింపు ఇచ్చింది.
వ్యాక్సిన్ల వల్ల దుష్ప్రభావాలు ఏర్పడతాయని తెలిపే ప్రకటనలపై ఇప్పటికే నిషేధం అమలు చేస్తోంది ఫేస్‌బుక్. తాజాగా.. టీకాలపై తప్పుడు సమాచారమిచ్చే ఏ యాడ్నైనా తొలగిస్తామని తేల్చిచెప్పింది.
వాటికే అనుమతి..
అదే సమయంలో ప్రభుత్వ విధానాలు, చట్టాలకు మద్దతినిచ్చే లేదా వ్యతిరేకించే యాడ్లను మాత్రం నిషేధించమని వెల్లడించింది ఎఫ్బీ. ఇవి రాజకీయపరమైన ప్రకటనలని.. ఆయా సంస్థలు స్పష్టం చేయాల్సి ఉంటుంది. వాటికి ఎవరు నిధులిస్తున్నారనే విషయాన్ని పొందుపరచాలని స్పష్టం చేసింది. ఇది కరోనా టీకాకు కూడా వర్తిస్తుందని పేర్కొంది. అయితే ఇవన్నీ పెయిడ్ యాడ్లకే అని ఫేస్‌బుక్ వివరించింది. వ్యాక్సిన్ ప్రయోజనాలపై దుష్ప్రచారాలు చేసే అన్‌పెయిడ్ పోస్టులను నిషేధించమని స్పష్టం చేసింది.
నకిలీ వార్తలను కట్టడి చేసేందుకు ఎఫ్బీ అనేక చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా కరోనా సంక్షోభంలో ఈ చర్యలు పెరిగాయి. కరోనాపై వచ్చే తప్పుడు సమాచారాలను నియంత్రించేందుకు కఠిన నిబంధనలను అమలు చేస్తోంది.
ఇదీ చూడండి:- ఫేస్‌బుక్ సెర్చ్ ఫిల్టర్స్‌ని ఎలా వాడాలంటే..