కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకు ప్రయోజనం కలిగే విధంగా ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) నిర్ణయం తీసుకుంది. మార్చి 24 నుంచి డిసెంబర్ 31 వరకు ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకు మూడు నెలల సగటు వేతనాలలో 50 శాతం చెల్లించేందుకు నిబంధనలు సడలించింది. ఈ నిర్ణయం వల్ల 40 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం కలగనుంది.
మరోవైపు, 'అటల్ బిమిత్ వ్యక్తి కల్యాణ్ యోజన' పథకం కింద ప్రయోజనాలు పొందేందుకు కావాల్సిన అర్హతలను సడలించింది. నిరుద్యోగ భృతిని పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జూన్ 31వరకు పథకం అందుబాటులో ఉంటుందని ఈఎస్ఐసీ స్పష్టం చేసింది. 2021 జనవరి 1నుంచి ఇదివరకటి నిబంధనలతో కొనసాగుతుందని వెల్లడించింది. నిబంధనల సడలింపుపై పరిస్థితులను బట్టి డిసెంబర్ 31 తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది.
30 రోజులకే..
భృతి పొందేందుకు కావాల్సిన అర్హత ప్రమాణాలను సడలించింది ఈఎస్ఐసీ. ఉద్యోగం కోల్పోయిన కార్మికులకు ఇదివరకు మూడు నెలల సగటు వేతనంలో 25 శాతం చెల్లిస్తుండగా... ప్రస్తుతం ఈ పరిమితిని 50 శాతానికి పెంచింది. ఇదివరకు.. ఉద్యోగం కోల్పోయిన 90 రోజుల తర్వాత భృతి అందజేస్తుండగా.. దాన్ని 30 రోజులకు తగ్గించింది.
నేరుగా ఖాతాల్లోకే
బీమా కలిగిఉన్న వ్యక్తులు నేరుగా ఈఎస్ఐసీ బ్రాంచ్ కార్యాలయంలో తమ క్లెయిమ్‌ను సమర్పించాలని, నగదును నేరుగా వారి ఖాతాల్లోకే బదిలీ చేస్తామని ఈఎస్ఐసీ తెలిపింది. క్లెయిమ్ చేసుకునే వారికి కనీసం రెండు సంవత్సరాల పాటు ఉద్యోగ బీమా కలిగి ఉండాలని పేర్కొంది. ఉద్యోగం కోల్పోయిన తర్వాత కాంట్రిబ్యూషన్ పీరియడ్‌లో కనీసం 78 రోజులు, మిగిలిన మూడు కాంట్రిబ్యూషన్ పీరియడ్స్లలో కలిపి 78 రోజులు పనిచేసి ఉండాలని తెలిపింది.
కొవిడ్ ప్రభావానికి గురైన కార్మికులను ఆదుకునేందుకు ఈఎస్ఐసీ మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపింది. ఈఎస్ఐసీ ఆస్పత్రులలోని 10 శాతం పడకలను ఐసీయూలుగా మార్చాలని నిర్ణయించింది.
ఇదీ చదవండి-విద్యుత్ షేర్ల దూకుడు- వారాంతంలోనూ లాభాలే