ఎయిరిండియా కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తూ పలువురు బిడ్లు దాఖలు చేశారని, వాటిని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్(దీపం) జనవరి 5-6 తేదీల్లో పరిశీలించి, అర్హులను ప్రకటిస్తుందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురీ తెలిపారు. 'ఎయిరిండియా ఆర్థిక వివరాలన్నీ వారికి అందించి, పరిశీలనకు 90 రోజుల గడువు ఇస్తాం. ఆ తర్వాత ఆర్థిక బిడ్లు దాఖలు చేయాలని కోరతాం. ప్రక్రియ అంతా పూర్తి పారదర్శకంగా, పటిష్ఠంగా చేపడుతున్నాం' అని మంత్రి తెలిపారు. కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం నడుస్తున్న విమానాల్లో ఛార్జీలకు విధించిన పరిమితులు వచ్చే ఫిబ్రవరి వరకు కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు.తర్వాత భాగస్వాములందరితో చర్చించి నిర్ణయిస్తామన్నారు.
- 2018 నవంబరులో 6 విమానాశ్రయాల ప్రైవేటీకరణకు బిడ్లు పిలవగా, మంగళూరు, లఖ్‌నవు, అహ్మదాబాద్‌లను ప్రైవేటు సంస్థలకు అప్పగించినట్లు చెప్పారు. కోర్టు కేసు కారణంగా ఆలస్యమైన తిరువనంతపురం విమానాశ్రయంతో పాటు గువాహటి, జైపుర్ విమానాశ్రయాలను కూడా ప్రైవేటు సంస్థ (అదానీ ఎంటర్‌ప్రైజెస్)కు అప్పగించనున్నట్లు చెప్పారు. ఇటీవలే సెక్యూరిటీ క్లియరెన్స్ వచ్చిందని, జనవరిలో వీటి అప్పగింతపై సంతకాలు చేస్తామన్నారు. 50 ఏళ్లపాటు ఈ లీజింగ్ ఉంటుంది.
- కొత్తగా వారణాశి, అమృత్‌సర్, భువనేశ్వర్, రాయ్‌పుర్, ఇండోర్, త్రిచ్చి విమానాశ్రయాలను ప్రైవేటీకరించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే 2021-22 తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా వివరించారు.
- ప్రస్తుతానికి ఎయిర్ బబుల్ ఒప్పందం ఉన్న 24 దేశాలకు విమానాలు నడుస్తాయని చెప్పారు. షెడ్యూల్డ్ విమానాలు ఎప్పటినుంచి నడుస్తాయనేది ప్రపంచదేశాల స్పందనపై ఆధారపడి ఉంటుందన్నారు. ఇంకా చాలా దేశాలు విదేశీ ప్రయాణికులను అనుమతించడం లేదని పేర్కొన్నారు.
ఇంటరప్స్ వెనకడుగు: అమెరికా కేంద్రంగా పనిచేసే ఫండ్ సంస్థ ఇంటరప్స్, ఎయిర్ ఇండియా రేసు నుంచి వెనకడుగు వేసింది. ఎయిర్ ఇండియా కొనుగోలుకు ఆ సంస్థ ఉద్యోగులతో కలిసి బిడ్ వేయాలన్నది ఇంటరప్స్ ప్రతిపాదన. అయితే చేతులు కలిపేందుకు ఎయిర్ ఇండియా ఉద్యోగులు నిరాకరించినందున ఆసక్తి వ్యక్తీకరణ బిడ్‌ను ఇంటరప్స్ ఉపసంహరించుకుంది.
ప్రతి శుక్రవారం హైదరాబాద్ - షికాగో విమానం
హైదరాబాద్, బెంగళూరు నుంచి నేరుగా అమెరికాకు నడవనున్న విమాన సర్వీసుల షెడ్యూల్‌ను ఎయిర్‌ఇండియా మంగళవారం ప్రకటించింది. హైదరాబాద్-షికాగో తొలి సర్వీసు జనవరి 15న బయల్దేరనుంది. వారానికోసారి చొప్పున ప్రతి శుక్రవారం 777ఎల్‌ఆర్ బోయింగ్ విమానం ఏఐ-107 నంబరుతో నడుస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం 12.50 గంటలకు బయల్దేరి, షికాగోకు(అక్కడి కాలమాన ప్రకారం) శుక్రవారం సాయంత్రం 6.05కు చేరుకుంటుంది. ప్రతి బుధవారం షికాగో నుంచి ఏఐ-108 బుధవారం రాత్రి 9.30 గంటలకు (అక్కడి కాలమానం ప్రకారం) బయలుదేరి మరుసటిరోజు అర్ధరాత్రి 12.40కు హైదరాబాద్ చేరుకుంటుంది.
- జనవరి 9న బెంగళూరు నుంచి నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వారానికి రెండుసార్లు విమాన సర్వీసులు నడవనున్నాయి. సోమ, గురువారాల్లో బెంగళూరులో మధ్యాహ్నం 2.30కు, శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ప్రతి శని, మంగళవారాల్లో బెంగళూరుకు ఈ విమానాలు బయలుదేరుతాయి.
ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ నూతన ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్!