ఫేక్ వాట్సాప్ లింక్‌లు మీకు కూడా గతంలో వచ్చుంటాయి. వాటిని క్లిక్ చేసి కొంతమంది ఇబ్బందులు పడి ఉంటారు. అలాంటి ఓ లింక్ ఇప్పుడు మళ్లీ కనిపిస్తోంది. 'పింక్ వాట్సాప్' (Pink Whatsapp) అంటూ ఓ లింక్ ఇటీవలే వైరల్ అవుతోంది. అది అచ్చంగా వాట్సాప్ లింక్‌లానే ఉంటుంది కానీ, వాట్సాప్‌కీ, దీనికీ సంబంధం ఏమీ ఉండదు. ఆ లింక్‌ను క్లిక్ చేస్తే మీ సమాచారం మొత్తం అగంతుకుల చేతికి చేరిపోతుంది.
పైన ఫొటోలో కనిపిస్తున్న తరహా లింకులే ఇప్పుడు వాట్సాప్‌లో సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ లింకులు క్లిక్ చేస్తే వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు మీకు అందుబాటులోకి వస్తాయని కూడా రాశారు. మీకు కూడా అలాంటి లింక్ వచ్చి ఉంటే పొరపాటున కూడా క్లిక్ చేయొద్దు. అసలు కొత్త వాట్సాప్ అంటూ ఏదైనా వస్తే వాట్సాప్ ప్లే స్టోర్ ద్వారానే వినియోగదారులకు అందిస్తుంది. ప్లే స్టోర్‌లో యాప్ అప్‌డేట్ చేసుకుంటే మీకు వాట్సాప్ అందించే కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.
ఇప్పటికే క్లిక్ చేసి ఉంటే...
ఫేక్ లింక్‌ను ఇప్పటికే క్లిక్ చేసి ఉంటే... వెంటనే మీ ఫోన్‌ను రీసెట్ చేయండి. దాని కోసం మొబైల్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అందులో సిస్టమ్ ఆప్షన్‌లోకి వెళ్తే రిసెట్ (Reset) అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఎరేజ్ ఆల్ డేటా (Erase All Data) ఆప్షన్ వస్తుంది. దీన్ని క్లిక్ చేసి మొబైల్‌ను రీసెట్ చేయొచ్చు. దీంతోపాటు మీ మెయిల్ ఐడీ, బ్యాంకు ఖాతాలు, సోషల్ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లు మార్చుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: రూ.10 లక్షలకు మించి డిపాజిట్ చేస్తే పన్ను?