వాహనం నీటిలో మునిగిపోతే ఇంజిను పాడైపోతుంది. సెన్సార్లు పాడైపోతాయి. ఎయిర్ బ్యాగ్స్ పనికి రావు. బాగు చేయించేందుకు వేలు, కొన్ని సందర్భాల్లో లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అంతా బాగై రోడ్డెక్కాలంటే ఇరవై రోజులకుపైగా పడుతుందని అంచనా. కొన్ని గంటల సమయం వాహనం నీటిలో మునిగిపోయి ఉంటే వాహనాల స్థితి ఎలా ఉంటుందో కూడా చెప్పలేమని వాహనరంగ నిపుణులు చెబుతున్నారు.
కేవలం నీటిలో నానటం ఒక సమస్య అయితే మట్టి, చెత్తా చెదారంతో నిండిపోతే మరో సమస్య. సున్నిత భాగాలు పాడైతే మళ్లీ బాగయ్యే అవకాశం దాదాపు లేనట్టేనని వాహన రంగ నిపుణులు హర్షిణ్ చెప్పారు. చాలా సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాల కింద వాహనాలకు బీమా వచ్చే అవకాశాలు అంతంత మాత్రమే. దీంతో పాడైన, కొట్టుకుపోయిన వాహనాల యజమానులు లబోదిబోమంటున్నారు.
ఇంజిన్ బీమా కీలకం..
ఇంజిన్ భద్రతకు కూడా బీమా చేయించుకోకుంటే మరమ్మతుల ఖర్చును పొందటం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. వాహనాలు బయట పార్కింగ్ చేసేవారు, లోతట్టు, తీర ప్రాంతాల్లో ఉండే వారు విధిగా ఇంజిన్ ప్రొటెక్షన్ పాలసీ తీసుకుంటే ఇంజిన్‌లోకి నీరు వెళ్లినా బీమాను పొందవచ్చని వాహన బీమా నిపుణుడు సజ్జా ప్రవీణ్ చెప్పారు. చాలామంది ఇంజిన్ బీమాపై అంతగా ఆసక్తి చూపరు. వాహన బీమాలో ఇంజిన్, ఇన్వాయిస్ కవర్ కూడా రక్షణ ఉందో, లేదో చూసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రీమియం కాస్త ఎక్కువ అనిపించినా ఆ జాగ్రత్త తీసుకున్న సందర్భంలో మరమ్మతులకు అయ్యే 75 శాతం కన్నా ఎక్కువ మొత్తాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి.
ఈ జాగ్రత్తలు అవసరం..
- ఎక్కువ సమయం నీట్లో మునిగి ఉన్న వాహనాన్ని వెంటనే స్టార్ట్ చేయడానికి ప్రయత్నించకూడదు.
- ఎయిర్ బాక్స్‌లోకి నీరు, మట్టి చేరినప్పుడు స్టార్ట్ చేస్తే ఇంజిన్ పూర్తిగా పాడవుతుంది.
- ఇంజిన్ భాగాలను నీటితో శుభ్రం చేసే ప్రయత్నం చేయకూడదు.
- బీమా వచ్చినా రాకపోయినా ఆయా కంపెనీల ప్రతినిధులను సంప్రదించి నిర్ధారించుకోవాలి.
- కంపెనీ ప్రతినిధి వాహనం ఫొటోలు, వీడియో తీసుకునేంత వరకు మరమ్మతులు చేయించే ప్రయత్నం చేయకూడదు.