వైరస్ ద్వారా సంక్రమించే ప్రాణాంతకమైన వ్యాధుల నివారణకు ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న ఔషధాల్లో వినియోగించే కీలకమైన మూడింటిలో రెండు ముడి పదార్థాలను దివీస్ లేబోరేటరీస్‌లో ఉత్పత్తి చేస్తున్నట్టు ఆ సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ పి.సుధాకర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
కొవిడ్-19ను కట్టడి చేయడానికి చైనా ఉపయోగించిన ఔషధాల్లో.. తమ పరిశ్రమలో ఉత్పత్తి చేసిన ‘లోపెనవీర్’ అనే ముడి పదార్థాన్ని వాడారని చెప్పారు. ప్రజారోగ్యానికి సంబంధించి విలువైన ఔషధాలను ఉత్పత్తి చేస్తున్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివీస్‌కు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చాయన్నారు. యాంటీ రెట్రోవైరల్‌గా ఉపయోగపడే లోపెనవీర్ ఔషధ తయారీకి వినియోగించే మూడు ముడి పదార్థాల్లో రెండింటిని యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజీగూడెంలోని దివీస్‌లో ఉత్పత్తి చేసి అమెరికా, ఇంగ్లండ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నామని సుధాకర్ తెలిపారు.