ETV Bharat / business

డిస్కమ్‌లకు విద్యుదాఘాతాలు- నియంత్రణ మండళ్ల పనితీరు నిస్తేజం - విద్యుత్‌ నియంత్రణ మండళ్లు

విద్యుత్‌ సంస్థలను కాపాడి ప్రగతిపథంలో నడిపించడం విద్యుత్‌ నియంత్రణ మండళ్ల(ఈఆర్‌సీలు) బాధ్యత. విద్యుత్‌ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రానికీ ఈఆర్‌సీ ఉంది. విద్యుత్‌ రంగాన్ని పూర్తిగా నియంత్రించి గాడిలో పెట్టాల్సిన ఈఆర్‌సీల పనితీరే నిస్తేజంగా ఉండటం వల్ల అంతిమంగా డిస్కమ్‌లు(Discoms In India) ఆర్థికంగా దెబ్బతింటున్నాయి. చట్టాలు, జాతీయ విద్యుత్‌ విధానాలకు భిన్నంగా డిస్కమ్‌లు, ఈఆర్‌సీలు పనిచేస్తున్నందు వల్ల ఆర్థిక సంక్షోభం విస్తరిస్తోందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. డిస్కమ్‌ల ప్రైవేటీకరణ దిశగా చకచకా అడుగులేస్తోంది.

discom rec
డిస్కమ్‌లు
author img

By

Published : Nov 2, 2021, 7:41 AM IST

దేశంలో బొగ్గు కొరత విద్యుత్‌ సంస్థల ఆర్థిక సంక్షోభాన్ని ప్రస్ఫుటం చేస్తోంది. విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కమ్‌)(Discoms In India)ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులవల్ల బొగ్గు గనులకు బకాయిలు వసూలు కావడం లేదు. డిస్కమ్‌లు ఆర్థికంగా మునిగిపోకుండా చూడాల్సిన 'విద్యుత్‌ నియంత్రణ మండళ్లు (ఈఆర్‌సీలు)' ఏం చేస్తున్నాయనేదీ కీలకప్రశ్నగా మారింది. విద్యుత్‌ సంస్థలను కాపాడి ప్రగతిపథంలో నడిపించడం, ఈఆర్‌సీల బాధ్యత. విద్యుత్‌ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రానికీ ఈఆర్‌సీ ఉంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి కరెంటు ఛార్జీలు పెంచే లేదా తగ్గించే ప్రతిపాదనలతో 'వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్‌ఆర్‌)'ను ఈఆర్‌సీకి డిస్కమ్‌లు ఏటా నవంబరు 30కల్లా అందజేయాలి. కానీ కొన్ని రాష్ట్రాల డిస్కమ్‌లు ఏటా టారిఫ్‌ ప్రతిపాదనలే ఇవ్వడంలేదు. ఈఆర్‌సీలను ఖాతరు చేయడంలేదు. మరికొన్ని రాష్ట్రాల్లో లెక్కలిచ్చినా ముఖ్యమంత్రి చెప్పిదానికల్లా ఈఆర్‌సీలు వంత పాడటంవల్ల, డిస్కమ్‌లు(Discoms In India) కోలుకోవడం లేదు. విద్యుత్‌ రంగాన్ని పూర్తిగా నియంత్రించి గాడిలో పెట్టాల్సిన ఈఆర్‌సీల పనితీరే నిస్తేజంగా ఉండటంతో అంతిమంగా డిస్కమ్‌లు ఆర్థికంగా దెబ్బతింటున్నాయి. చట్టాలు, జాతీయ విద్యుత్‌ విధానాలకు భిన్నంగా డిస్కమ్‌లు, ఈఆర్‌సీలు పనిచేస్తున్నందువల్ల ఆర్థిక సంక్షోభం విస్తరిస్తోందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. డిస్కమ్‌ల ప్రైవేటీకరణ దిశగా చకచకా అడుగులేస్తోంది.

ఆర్థిక సంక్షోభం

గుజరాత్‌, హరియాణా మినహా ఇతర రాష్ట్రాల డిస్కమ్‌ల(Discoms In India) పనితీరు అధ్వానంగా ఉందని కేంద్ర విద్యుత్‌శాఖ ఇటీవల విడుదల చేసిన ర్యాంకుల నివేదిక ఎండగట్టింది. వాటి నిర్వహణ, ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వ నిధుల విడుదల, ఈఆర్‌సీల పనితీరు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 41 డిస్కమ్‌లకు ర్యాంకులిస్తోంది. హరియాణాలో ఒకటి, గుజరాత్‌లో నాలుగు డిస్కమ్‌లకు మాత్రమే 'ఏ ప్లస్‌' ర్యాంకు వచ్చింది. దీన్నిబట్టి మిగతా డిస్కమ్‌ల పనితీరు ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని రెండు డిస్కమ్‌లకు 19, 34; తెలంగాణ డిస్కమ్‌లకు 23, 33 స్థానాలతో బీ, సీ ర్యాంకులు దక్కాయంటే వాటి పనితీరు ఎలా ఉందో ఊహించవచ్చు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏళ్ల తరబడి కరెంటు ఛార్జీలు పెంచడం లేదని ప్రకటనలు చేస్తున్నా- డిస్కమ్‌లు ఎందుకు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయో ఎక్కడా చెప్పడం లేదు. దేశంలో అన్ని డిస్కమ్‌ల నష్టాలు 2020 మార్చి నాటికే రూ.56 వేల కోట్లకు చేరాయని కేంద్రం తాజాగా వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇస్తున్నారు. కానీ వ్యవసాయానికెంత కరెంటు సరఫరా చేస్తున్నారనే లెక్కలే పక్కాగా లేవు. వ్యవసాయ కరెంటుకు రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా లక్ష కోట్ల రూపాయలకు పైగా ఏటా డిస్కమ్‌లకు చెల్లిస్తున్నాయి. ప్రతి వ్యవసాయ బోరుకు మీటరు పెట్టి లెక్కలు తయారుచేయాలని కొత్త విద్యుత్‌ బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. దీన్ని తెలంగాణ, ఏపీ, పశ్చిమ్‌ బంగ, తమిళనాడు తదితర రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఓట్ల రాజకీయాల కోసమే విద్యుత్‌ రంగంలో సంస్కరణలను కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. వ్యవసాయ కరెంటు లెక్కలిచ్చేది లేదంటూ రాష్ట్ర ప్రభుత్వాలే కేంద్రంతో పోరాడుతున్నందువల్ల- వాటి ఏలుబడిలో ఉన్న డిస్కమ్‌లు మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ డిస్కమ్‌లో 34.49శాతం కరెంటు నష్టపోతున్నట్లు కేంద్రం ర్యాంకుల నివేదికలో స్పష్టం చేసింది.

ఈఆర్‌సీలే నడుం బిగించాలి

ఈఆర్‌సీలు నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే డిస్కమ్‌ల(Discoms In India) పనితీరు కచ్చితంగా మెరుగుపడుతుంది. ఏటా నవంబరు కల్లా డిస్కమ్‌లు టారిఫ్‌ ప్రతిపాదనలు ఇవ్వకున్నా వాటిని సవరించి తుది ఉత్తర్వులు సొంతంగా జారీచేయాలని అన్ని రాష్ట్రాల ఈఆర్‌సీలను కేంద్రం తాజాగా ఆదేశించడం ఆహ్వానించదగిన పరిణామం. ఒక్కో యూనిట్‌ కరెంటుపై సగటు వ్యయంకన్నా నాలుగు రెట్ల వరకు అదనంగా ఛార్జీలు వసూలుచేస్తున్న డిస్కమ్‌ల మెడలు వంచి ఈఆర్‌సీలు దారికితేవాలి. కొన్న ప్రతి యూనిట్‌ కరెంటును ఎక్కడ ఎవరికి సరఫరా చేశారనే లెక్కలు డిస్కమ్‌ల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా నవంబరుకల్లా ఈఆర్‌సీకి ఇప్పించాలి. ఒక పార్టీ అయిదేళ్లపాటు పాలనలో ఉన్నంత కాలం కరెంటు ఛార్జీలను పెంచకుండా ప్రజలకు మేలు చేస్తున్నామని మభ్యపెట్టి- ఆ తరవాత ఎన్నికల్లో ఓడిపోతే మరో పార్టీ అధికారంలోకి వచ్చేసరికి డిస్కమ్‌లు పీకల్లోతు నష్టాల్లో మునిగి ఉంటాయి. ఈ నష్టాలు పాత ప్రభుత్వానివేనని ప్రజల నుంచి 'ట్రూ అప్‌' ఛార్జీల పేరుతో వసూలు చేయాలని కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ ఈఆర్‌సీకి సూచిస్తోంది. ఇలా చెప్పినప్పుడు వెంటనే తలాడించి ప్రజల నుంచి వసూలు చేసే విధానాలు ఇకనైనా మారాలి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం యూనిట్‌ కరెంటు సరఫరాకు సగటు వ్యయం రూ.7.10 అవుతోంది. ఉచితంగా లేక తక్కువ ఛార్జీకి ఇచ్చే కరెంటు కోసం రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్‌లకు రాయితీ కింద నిధులు చెల్లించాల్సిందే. ఇందుకోసం మరో రంగంలో పన్నుల రూపంలో డబ్బును ప్రజల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. కరెంటు ఉచితంగా గానీ, సగటు సరఫరా వ్యయంకన్నా తక్కువ ఛార్జీలకు గానీ రాదని ప్రజలు గుర్తిస్తేనే- విద్యుత్‌ రంగం బాగుపడుతుంది. పేదలకు సరఫరా చేసే కరెంటుకు- ఆ రాయితీ నిధులను రాష్ట్రాల నుంచి వసూలు చేసి డిస్కమ్‌లకు ఇప్పించేలా ఈఆర్‌సీలు నడుం బిగించాలి. లేకపోతే కేంద్రం- డిస్కమ్‌లను ప్రైవేటు యాజమాన్యాలకు అప్పగించే పరిస్థితులు పొంచి ఉన్నాయి. అదే జరిగితే ఆ పాపం రాష్ట్ర ప్రభుత్వాలు, ఈఆర్‌సీలదేనని అందరూ గుర్తించాలి.

తప్పుడు లెక్కలు... అప్పనంగా రాయితీలు

ప్రజలకు సరఫరా చేసే కరెంటుపై పెడుతున్న వ్యయానికి అనుగుణంగా డిస్కమ్‌లకు ఆదాయం వచ్చేలా చూడాల్సిన బాధ్యత నియంత్రణ మండళ్లదే. పాలకులు ఓట్ల కోసం ప్రజాకర్షక పథకాల కింద అనేక వర్గాలకు ఉచితంగా లేదా తక్కువ ఛార్జీలకే కరెంటు సరఫరా చేయాలంటూ డిస్కమ్‌లను ఆదేశిస్తున్నారు. సగటు సరఫరా వ్యయం(ఏసీఎస్‌)కన్నా తక్కువకు కరెంటు ఇవ్వమన్నప్పుడు- ఆ లోటు పూడ్చేందుకు నిధులను రాయితీ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం కరెంటు సరఫరాకు ముందే డిస్కమ్‌లకు చెల్లించాలనే నిబంధన ఉంది. ఇలా చెల్లించేలా చూడాల్సిన బాధ్యత నియంత్రణ మండళ్లపై ఉంది. కానీ రాయితీ కింద ఎంత సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలనే లెక్కలను డిస్కమ్‌లు ఏటా నవంబరుకల్లా మండళ్లకు ఇవ్వడం లేదు. పాలనాలోపాలు, అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి తప్పుడు లెక్కలను ఇస్తూ అధికంగా రాయితీ నిధులు పొందుతున్నట్లూ ఆరోపణలున్నాయి. మహారాష్ట్రలో వ్యవసాయానికి కరెంటు ఎక్కువగా ఇస్తున్నామంటూ రూ.35 వేల కోట్ల వరకు అదనపు సొమ్మును రాయితీ పేరుతో అక్కడి డిస్కమ్‌లు కొన్నేళ్ల పాటు ప్రభుత్వం నుంచి వసూలుచేసినట్లు తేలింది.

- మంగమూరి శ్రీనివాస్‌

ఇవీ చూడండి:

మహానగరాల్లో మాయగాళ్లు- పేట్రేగుతున్న ఆర్థిక నేరాలు

మనిషితనానికి చదువుల ఒరవడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.