Cryptocurrency in India: ఈ మధ్యకాలంలో బాగా చర్చనీయాంశమైన అంశాల్లో క్రిప్టోకరెన్సీ ఒకటి. భారత్‌లో దీని భవిష్యత్తుపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. కానీ, దీంట్లో మదుపు చేయడానికి యువతరం ఏమాత్రం వెనుకాడడం లేదు. ఈ వర్చువల్ కరెన్సీపై వ్యక్తమవుతున్న ఆందోళనలు కొత్త తరాన్ని కట్టడి చేయలేకపోతున్నాయి. పైగా క్రిప్టో కరెన్సీ వెనకాల ఉన్న బ్లాక్‌చైన్ సాంకేతికతకు మరింత ఆదరణ పెరుగుతోంది.
ఆర్‌బీఐ హెచ్చరించినా..
క్రిప్పోకరెన్సీ ప్రధాన మారకద్రవ్యంగా మారితే దేశ స్థూల ఆర్థిక వ్యవస్థపై 'తీవ్ర పరిణామాలు' ఉండే అవకాశం ఉందని స్వయంగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ గతంలో హెచ్చరించారు. వీటిని కనీసం ఇన్వెస్ట్‌మెంట్ ప్రత్యామ్నాయాలుగా కూడా అనుమతించవద్దని ఆర్‌బీఐ ఓ సందర్భంలో అభిప్రాయపడింది. అవసరమైతే చైనా తరహాలో పూర్తిస్థాయి నిషేధం విధించాలని సూచించింది. ఇక ఇటీవల ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ నియంత్రణా బిల్లును పార్లమెంటు వెబ్‌సైట్‌లో లిస్ట్ చేశారు. కానీ, దాన్ని సభలో మాత్రం ప్రవేశపెట్టలేదు.
భారతీయులు ఎంత మదుపు చేశారు?
భారత్‌లో క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రపంచంలో క్రిప్టోలో మదుపు చేసిన వారిలో భారతీయులే అత్యధికులు. తర్వాత అమెరికా, రష్యా మదుపర్లు ఉన్నారు. బ్రోకర్‌చూజర్ వెబ్‌సైట్ ప్రకారం మన దేశంలో ఇప్పటి వరకు 100 మిలియన్ల మంది క్రిప్టోలో మదుపు చేశారు. ప్రపంచ క్రిప్టోకరెన్సీ మార్కెట్ విలువ నవంబరు నాటికి 3 ట్రిలియన్ డాలర్లు కాగా.. దీంట్లో భారతీయుల వాటా 10 బిలియన్ డాలర్లు. మన దేశం నుంచి ఎక్కువ మంది రిటైల్ మదుపర్లే వీటిలో పెట్టుబడి పెట్టారు. బిట్‌కాయిన్, ఇథేరియం, లైట్‌కాయిన్, కార్డనో, డోజీకాయిన్.. వంటి వాటిలో ఎక్కువ మంది మదుపు చేస్తున్నారు. గత ఏడాది వ్యవధిలో వీరిలో కొంతమంది 100 శాతం వరకు రిటర్న్స్ అందుకున్నారు. ప్రస్తుతం క్రిప్టోలో భారత రిటైల్ మదుపర్లు మదుపు చేసిన విలువ 6.6 బిలియన్ డాలర్లు. ఇది 2030 నాటికి 15.6 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని నాస్కామ్ అంచనా వేసింది. అయితే, ఈ లెక్కల్ని ఆర్‌బీఐ తోసిపుచ్చింది. గణాంకాలను ఎక్కువ చేసి చూపుతున్నారని తెలిపింది. రిటైల్ మదుపర్లు రూ.1,000-2,000 మించి క్రిప్టోల్లో మదుపు చేయడం లేదని పేర్కొంది. ప్రపంచంలో ఇప్పటి వరకు 300 క్రిప్టో ఎక్స్ఛేంజీలు ఉన్నాయి. వీటిలో 10 భారత్‌కు చెందినవి. యునోకాయిన్, కాయిన్ డీసీఎక్స్, కాయిన్‌స్విచ్ కూబర్, జెబ్‌పే, వజీరిక్స్.. వీటిలో ప్రధానమైనవి. ప్రైవేటు క్రిప్టోకరెన్సీలను ఆదరించడంలో వియత్నాం తర్వాత భారతే ఉందని ‘చైన్‌అనాలసిస్’ అనే సంస్థ తెలిపింది. జులై 2020-జూన్ 2021 మధ్య భారత్‌లో క్రిప్టోకరెన్సీ ‘అడాప్షన్ రేటు’ 641 శాతం పెరిగిందని వెల్లడించింది.
ఆదరణ ఎందుకు పెరిగింది?
క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌పై ఆర్‌బీఐ విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసిన విషయం తెలిసిందే. అమెరికాలో అక్కడి సెక్యూరిటీ ఎక్స్ఛేంజీలు బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లను అనుమతించాయి. ఈ పరిణామాలు వర్చువల్ కరెన్సీల ఆదరణకు దోహదం చేశాయి. మరోవైపు ఆర్‌బీఐ సొంతంగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో క్రిప్టోకరెన్సీపై ఎలాంటి నియంత్రణలు విధించనుందనే దానిపైనే భారత్‌లో వీటి భవిష్యత్తు ఆధారపడి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బ్లాక్‌చైన్ ఓకే.. కానీ,
ఆర్‌బీఐ మాత్రం ఇప్పటి వరకు క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌పై ఎలాంటి నియంత్రణలు విధించలేదు. అయితే క్రిప్టోకరెన్సీ లావాదేవీలకు దూరంగా ఉండాల్సిందిగా మే మొదటి వారంలో ఆర్‌బీఐ కొన్ని బ్యాంకులకు సూచించింది. ఇందులో ఐసీఐసీఐ బ్యాంక్, యెస్‌బ్యాంక్, పేటీఎం తదితర సంస్థలున్నాయి. ఎస్‌బీఐ తన ఖాతాదారులకు పంపిన ఇ-మెయిల్‌లో క్రిప్టోకరెన్సీ లావాదేవీల కోసం సంస్థలకు ఆర్‌బీఐ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని పేర్కొంది. ఎస్‌బీఐ కార్డు కూడా తన వినియోగదారులకు వర్చువల్ కరెన్సీతో లావాదేవీలు నిర్వహించడం వల్ల చట్టపర చిక్కులతో పాటు, ఖాతాదారుల రక్షణ లాంటివి ప్రభావితం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. క్రిప్టోలను ఉగ్రవాదులకు నిధులను సమకూర్చేందుకు వినియోగించే అవకాశం ఉందని ఆర్‌బీఐ హెచ్చరించింది. అయితే, ఈ వర్చువల్ కరెన్సీ వెనుక ఉన్న బ్లాక్‌చైన్ సాంకేతికతను మాత్రం కేంద్ర బ్యాంకు కొట్టిపారేయడం లేదు. పైగా సీబీడీసీని కూడా ఈ టెక్నాలజీ ఆధారంగానే తీసుకొస్తున్నట్లు సమాచారం. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు సీబీడీసీలను ప్రవేశపెట్టడం అనివార్యమయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి : 'ఆయిల్ సర్వే'లో విస్తుపోయే నిజాలు.. వంటనూనెలు కల్తీమయం!