ఔషధ తయారీ సంస్థ.. గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తి చేసిన ఔషధం ఫ్లాబిఫ్లూ(ఫావిపిరావిర్)పై డీసీజీఐకి ఫిర్యాదు చేశారు ఓ పార్లమెంటు సభ్యుడు. వినియోగం, ధరలలపై పలు ప్రశ్నలు లేవనెత్తారు.
'అధిక రక్తపోటు, మధుమేహం కలిగిన కొవిడ్-19 బాధితులకు కూడా యాంటీ వైరల్ ఔషధమైన ఫ్యాబిఫ్లూ (ఫావిపిరావిర్) ఔషధం బాగా పనిచేస్తుందనే ప్రచారం తప్పు. బీపీ వంటివి ఉన్నవారికి ఫ్యాబీఫ్లూ ఎలా పనిచేస్తుందనే అంశంపై సమగ్ర క్లినికల్ వివరాలు లేవు. ధర కూడా మధ్యతరగతి ఆదాయ వర్గీయులకూ అందనంత అధికంగా ఉంది. 122 బిళ్లల కోర్సు మొత్తానికి రూ.12,500 అవుతోంది. ఈ టాబ్లెట్ల ధరను పేదలకూ అందుబాటులోకి తేవాలి' అని పార్లమెంటు సభ్యుడు ఒకరు తమకు ఫిర్యాదు చేశారని, దీనిపై వివరణ ఇవ్వాలని తయారీ సంస్థ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్‌ను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) డాక్టర్ వీజీ సోమానీ ఆదేశించారు.
అన్ని అంశాలపైనా వివరణ ఇవ్వాలని కంపెనీని కోరారు. అయితే ఫ్యాబిఫ్యూ టాబ్లెట్ ధరను రూ.103 నుంచి రూ.75కు తగ్గిస్తూ, ఈనెల 13న గ్లెన్‌మార్క్ నిర్ణయం తీసుకుంది.