దేశంలోని సాధారణ ప్రజలకు భద్రమైన, సమర్థమైన కరోనా టీకా కొవిషీల్డ్‌ను రూ.500-600కే వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో అందుబాటులోకి తెస్తామనే విశ్వాసాన్ని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) ఆధార్ పూనావాలా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు రెండు డోసులు వాడాలి కనుక సాధారణ ప్రజలకు రూ.1000-1200 అవుతుందన్నారు. గురువారం జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమిట్-2020లో ఆయన ఆ ప్రసంగించారు. ప్రభుత్వం భారీమొత్తంలో కొనుగోలు చేస్తుంది కనుక, ఒక్కో డోసు 3-4 డాలర్లకే ప్రభుత్వ సరఫరాకు అందిస్తామన్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేయడం కోసం బ్రిటన్-స్వీడన్ కంపెనీ ఆస్ట్రాజెనెకాతో పుణెకు చెందిన సీఐఐ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి విదితమే. ఆక్స్‌ఫర్డ్ టీకాకు సంబంధించి తుది దశ క్లినికల్ పరీక్షలు భారత్‌లో ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే.
జనవరి కల్లా వైద్య సిబ్బందికి!
'భారత్‌లో ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి సీరమ్ డిసెంబరులో దరఖాస్తు చేసుకుంటుంది. జనవరిలో అనుమతులు లభిస్తే, జనవరి-ఫిబ్రవరి నెలల్లోనే వైద్యులు, ఇతరత్రా అత్యవసర సిబ్బందికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. సాధారణ ప్రజలకు మార్చి-ఏప్రిల్ కల్లా విక్రయించగలం. అప్పటికి 30-40 కోట్ల డోసులు సిద్ధంగా ఉంచగలమని భావిస్తున్నాం. వ్యాక్సిన్ విడుదల అనేది బ్రిటన్‌లో ఆస్ట్రాజెనెకా పెద్దసంఖ్యలో నిర్వహిస్తున్న క్లినికల్ పరీక్షల ఫలితాలపై ఆధారపడే ఉంటుంద'ని ఆయన వివరించారు. పరీక్షా ఫలితాలు ఆలస్యమైతేనే, ఈ అంచనాల్లో మార్పులుంటాయని పేర్కొన్నారు. ఆక్స్‌ఫర్డ్ టీకా కనీసం ఏడాది పాటు కరోనా నుంచి రక్షణను కల్పిస్తుందని ఆస్ట్రాజెనెకా సీఈఓ పాస్కల్ సోరియత్ పేర్కొన్న సంగతి తెలిసిందే. బ్రిటిష్ మెడికల్ జర్నల్ లాన్సెట్ ప్రచురించిన కథనం ప్రకారం.. ఈ కరోనా వ్యాక్సిన్ వయో వృద్ధుల్లో, యువతలో సమాన స్థాయిలో రోగ నిరోధక వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది.
తయారీ సామర్థ్యం రెట్టింపు
'ప్రస్తుతం నెలకు 5-6 కోట్ల వ్యాక్సిన్ డోసులు తయారు చేసే సామర్థ్యం సీఐఐకు ఉంది. విస్తరణ పనులతో, వచ్చే ఫిబ్రవరి కల్లా నెలకు 10 కోట్ల డోసులు ఉత్పత్తి చేయగలం. ప్రస్తుతం రెండు ప్లాంట్లలో కొవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్నాం. జనవరి/ఫిబ్రవరికి మరో 2 ప్లాంట్లు కూడా దీనికే కేటాయిస్తాం. పేద దేశాలు మినహా, ఇతర దేశాలకు సరఫరా చేసేందుకు ప్రస్తుతం ఒప్పందాలు చేసుకోవడంలేదు. ముందు మన దేశంలోని 100 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించడమే ధ్యేయం' అని పూనావాలా వివరించారు. అమెరికాకు చెందిన నోవామ్యాక్స్ వ్యాక్సిన్‌ను కూడా ఏప్రిల్/మే నెలల్లో ఆవిష్కరించగలమని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.