కరోనా నేపథ్యంలో నెలకొన్న సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఉద్యోగాలు, వేతనాల కోతకు ఐటీ సంస్థలు మొగ్గుచూపొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొన్ని సంస్థలు రెండూ చేయొచ్చని అంటున్నారు.
దిగ్గజాలపై ప్రభావం తక్కువే..
గూగుల్, ఫేస్బుక్ వంటి దిగ్గజ సంస్థలపై ఈ సమస్య అంతగా ఉండకపోవచ్చని ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్ రంగస్వామి తెలిపారు. ఆయా సంస్థలు ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించొచ్చని అన్నారు. పెద్ద కంపెనీల్లో 18 నుంచి 24 నెలలకు సరిపడా నగదు ఉంటుందని.. అది వారికీ తెలుసన్నారు. 'ప్రస్తుత పరిస్థితుల్లో సంపాదన అంత ముఖ్యం కాదు.. అలా చేస్తే వాళ్ల విలువలు పడిపోతాయని' రంగస్వామి అభిప్రాయపడ్డారు. సమస్యంతా అంకురాలు, చిన్న సంస్థలదేనన్నారు.
"సంక్షోభం కారణంగా వచ్చే నెల లోపు భారీ నిరుద్యోగ సమస్య చూడాల్సి వస్తుంది. ఇది 2007-2008 సంక్షోభం కన్నా పెద్దగా ఉంటుంది. 2000 సంవత్సరంలో వచ్చిన డాట్కామ్ బబుల్ సమస్యలా ఇది ఉండొచ్చు. దాదాపు 5 నుంచి 10 శాతం ఐటీ ఉద్యోగాలు దీనికి ప్రభావితమయ్యే అవకాశముంది."
-రంగస్వామి, వెంచర్ క్యాపిటలిస్ట్
ప్రభావితమయ్యే సంస్థలు ఇవే..
ముఖ్యంగా ట్రావెల్, టూరిజం, హోటళ్లకు సేవలందిస్తున్న సంస్థలు సంక్షోభంలో పడే ప్రమాదముంది. ఆర్థికరంగ సంస్థలకు సేవలందిస్తున్న కంపెనీలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని రంగస్వామి అంచనా వేశారు.
హెచ్-1బీ వీసాలతో పని చేస్తున్న భారతీయ ఉద్యోగులపైనా ఈ ప్రభావం ఉండకపోవచ్చని రంగస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:బంగారానికి రెక్కలు-ఏడేళ్ల గరిష్ఠానికి ధరలు