రత్నాలు, ఆభరణాల తయారీ, ఎగుమతుల రంగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ మేరకు రానున్న బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ప్రతిపాదనలు చేసింది కేంద్ర వాణిజ్య శాఖ. ఈ నిర్ణయంతో బంగారం ధరలు దిగిరానున్నాయి.
12.5 నుంచి 4 శాతానికి..
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 12.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించాలని వాణిజ్య శాఖ కోరిందిని అధికార వర్గాలు వెల్లడించాయి.
పడిపోయిన దిగుమతులు
నవంబర్లో 152 టన్నులుగా ఉన్న బంగారం దిగుమతులు డిసెంబర్ నాటికి 39 టన్నులకు పడిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో దేశంలో బంగారం దిగుమతులు 7 శాతం తగ్గి 20.57 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు 22.16 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
తగ్గిన వర్తక లోటు
బంగారం దిగుమతులు తగ్గడం వల్ల దేశంలో వర్తక లోటు 2018-19లో ఉన్న 133.74 బిలియన్ డాలర్ల నుంచి 2019-20లో 106.84 బిలియన్ డాలర్లకు తగ్గింది. అక్టోబర్ నెల వరకూ బంగారం దిగుమతుల్లో ప్రతికూల వృద్ధి నమోదైంది.
రెండో స్థానంలో
ప్రపంచంలో బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. సంవత్సరానికి సగటున 800-900 టన్నుల పుత్తడి విదేశాల నుంచి దిగుమతి అవుతోంది. ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని అధికంగా విధించడం వల్ల వర్తకులు తమ ఉత్పత్తి కేంద్రాలను విదేశాలకు తరలిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: బ్రేజాకు భారతీయులు ఫిదా.. 5 లక్షల విక్రయాలు!