గత త్రైమాసికంతో పోల్చుకుంటే సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్లో చైనా ఆర్థిక వ్యవస్థ (China Slowdown 2021) క్షీణించింది. ఆ దేశంలో అత్యంత కీలకమైన నిర్మాణ రంగం (China Construction Industry) మందగమనంగా సాగడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అంతేగాకుండా కరోనా మహమ్మారి నుంచి కోలుకోవడం వల్ల ఇంధన వినియోగం పెరగడం కూడా దీనిపై ప్రభావం చూపింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బీజింగ్ వృద్ధి.. ఈ త్రైమాసికంలో 4.9 శాతానికి పరిమితమైంది. కిందటి త్రైమాసికంలో ఇది 7.9 శాతంగా ఉంది.
పారిశ్రామిక ఉత్పత్తి, రిటైల్ అమ్మకాలు, నిర్మాణంలో పెట్టుబడులతో పాటు ఇతర స్థిరాస్తులన్నీ బలహీనపడినట్లు లెక్కలు చెప్తున్నాయి. లక్షలాది ఉద్యోగాలు ఉన్న నిర్మాణరంగంలో డెవలపర్లకు రుణాలు ఇవ్వడంపై నియమాలు మరింత కఠినతరం కావడం వల్ల ఈ రంగం మందగమనంలో సాగుతోంది. ఇదే క్రమంలో చైనాలో అతిపెద్ద నిర్మాణరంగ సంస్థ అయిన ఎవర్‌గ్రాండ్ గ్రూప్ (China Evergrande) ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది.
సెప్టెంబర్ మధ్యకాలంలో కొన్ని ప్రధాన రాష్ట్రాల్లో విద్యుత్ కోతల కారణంగా తయారీరంగం దెబ్బతింది. ఇప్పటికే కొన్ని సర్వే సంస్థలు చైనా ఆర్థిక వృద్ధి అంచనాలు తగ్గించాయి. అయినప్పటికీ 8శాతం వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నాయి.
ఇదీ చూడండి: కేంద్రం కీలక నిర్ణయం- మరింత దిగిరానున్న ఉల్లి ధరలు!