ఏ రుణం కావాలన్నా తరచూ వినిపించే మాట క్రెడిట్ స్కోర్. క్రెడిట్ కార్డు, గృహ, వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా రుణమిచ్చే సంస్థలు మన క్రెడిట్ స్కోర్‌నే ప్రామాణికంగా చూస్తాయి. అయితే క్రెడిట్ స్కోరు, క్రెడిట్ రిపోర్టుకు మధ్య తేడా ఏంటనేది తెలుసుకుంటూ ఈ కథనం ప్రారంభిద్దాం.
క్రెడిట్ స్కోరు:
ఇది వ్యక్తి ఆర్థిక లావాదేవీలు, రుణ సంబంధిత చెల్లింపులు తదితర వివరాలను తీసుకుని గణించే సంఖ్య. దీని ఆధారంగా మీకు రుణ లభ్యత ఉంటుంది. మీ క్రెడిట్ స్కోరు ఎంత ఆర్థిక పరంగా మీ విశ్వసనీయతను సూచిస్తుంది. క్రెడిట్ స్కోరు అందించే కంపెనీలు వివిధ రకాల పద్ధతుల్లో క్రెడిట్ స్కోరును జారీచేస్తాయి.
క్రెడిట్ నివేదిక:
ఒక వ్యక్తి ఆర్థిక లావాదేవీలు, రుణ చరిత్ర తదితర వివరాలను అందించే దాన్ని క్రెడిట్ నివేదిక అంటారు. క్రెడిట్ రిపోర్టింగ్ సమాచారాన్ని బ్యాంకులు, క్రెడిట్ కార్డు కంపెనీల దగ్గర నుంచి పొందుతాయి. క్రెడిట్ నివేదికలో ఆ వ్యక్తికి ఉన్న బ్యాంకుల ఖాతాల సంఖ్య, రకం, చెల్లింపుల చరిత్ర, రుణాలు, ఎంత కాలం నుంచి బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నారు. తదితర వివరాలన్నీ అందులో ఉంటాయి. వ్యక్తి క్రెడిట్ నివేదికలను ఎన్నిసార్లు తీసుకున్నారనే విషయం కూడా నివేదికలో ఉంటుంది. ఈ విషయం చాలా ముఖ్యం ఎందుకంటే ఎక్కువ సార్లు క్రెడిట్ స్కోరు చెక్ చేసుకుంటే రుణం తీసుకునేందుకు ఆసక్తి ఎక్కువ ఉన్నట్లు సంకేతాలు వెళ్లొచ్చు. ఒక సారి నివేదిక చెక్ చేసుకుంటే ఒక ఇంక్వెరీ కింద పరిగణిస్తారు. అలా ఎన్ని సార్లు తీసుకుంటే అన్ని ఇంక్వెయిరీల కింద లెక్కేస్తారు.
క్రెడిట్ చరిత్ర :
ఒక వ్యక్తి తాలుకా గత లావాదేవీలు, చెల్లింపులు తదితర వివరాల ఆధారంగా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలు నివేదికలను జారీచేస్తుంటాయి. వాటిని ఆధారంగా చేసుకుని మీ క్రెడిట్ స్కోర్ ను నిర్ధరిస్తారు. ఆర్థిక సేవలను అందించే సంస్థలు ఉచితంగా తమ వినియోగదారులకు క్రెడిట్ నివేదికలను అందింస్తుంటాయి. అది ఏడాది కాలపరిమితికి ఉంటుంది. వినియోగదార్లు ఈ నివేదికను ఎన్ని సార్లైనా చూసుకునే వెసులుబాటును కొన్ని సంస్థలు కల్పిస్తున్నాయి.
క్రెడిట్ నివేదికలిచ్చే సంస్థలతో అనుసంధానమైందా :
కొన్ని సంస్థలు తమ వినియోగదారుల క్రెడిట్ నివేదికలను జారీ చేసేందుకు వ్యక్తిగత వివరాలు ఈమెయిల్ , పేరు, మొబైల్ నంబరు, పాన్ తదితర వివరాలను అడుగుతారు. వాటిని అందించిన వారికి ఉచితంగా క్రెడిట్ స్కోరును తెలిపే నివేదికను జారీ చేస్తారు. అయితే ఇక్కడ మీరు ఇచ్చిన వివరాలు ఇతర థర్డ్ పార్టీల వారికి అందింస్తే మీ సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉచితంగా క్రెడిట్ స్కోరు ఇస్తున్నసంస్థలు ఏదైనా క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో (సీఐసీ) తో అనుబంధం కలిగి ఉన్నారా లేదా అనేది చూసుకోవాలి.
మీ సమాచారం దుర్వినియోగం అయ్యేందుకు అవకాశం ఉందా?
ఒక వ్యక్తి ఆర్థిక లావాదేవీలు, రుణ చరిత్ర తదితర వివరాలను అందించే దాన్ని క్రెడిట్ నివేదిక అంటారు.
మీరిచ్చే సమాచారం సర్వీసు ప్రొవడైర్లకు అందుతుంది. సాధారణంగా వివరాలు ఇచ్చేటపుడు వినియోగదారుల అంగీకారం అడుగుతారు. మీ సమాచారం ఇతర సంస్థలతో పంచుకోవచ్చా? లేదా? అని ఒక ప్రశ్న ఉంటుంది. వినియోగదారులు ఇక్కడ వద్దు అని టిక్ చేస్తే మీ సమాచారం థర్డ్ పార్టీ వ్యక్తులు లేదా సంస్థలతో పంచుకోరు. ఒక వేళ మీరు ఓకే అని టిక్ చేస్తే మీ వివరాలు ఇతరులకు చేరొచ్చు. అప్పుడు అనవసరంగా ఈమెయిల్ లు, ఫోన్ కాల్ లు వస్తుంటాయి. కాబట్టి వినియోగదారులు ఉచిత క్రెడిట్ నివేదికను పొందేందుకు వారడిగే సమాచారం పట్ల జాగ్రత్త వహించాలి.
వారిచ్చే సలహాలు, అందించే సేవలు…
పాలసీబజార్, బ్యాంక్ బజార్, మనీ మంత్రా లాంటి వెబ్ సైట్లు ఉచితంగా క్రెడిట్ స్కోరు నివేదికలను అందింస్తుంటాయి. దీంతో పాటు వారు ఇతర సేవలను కూడా అందింస్తుంటారు. ఈ తరహా సర్వీసు ప్రొవైడర్లు వినియోగదారులకు తమ క్రెడిట్ స్కోరు మెరుగుపరించేందుకు ఏం చేయాలి ? ప‌్రతీ నెల వారి క్రెడిట్ నివేదిక సంబంధిత వివరాలను అలెర్టుల రూపంలో తమ వినియోగదారులకు పంపడం చేస్తుంటారు.
చివరిగా…
మీరు క్రెడిట్ స్కోరు నివేదికలు ఉచితంగా ఇచ్చే సంస్థల నుంచి తీసుకోవద్దనికాదు. ఉచితంగా ఇస్తే తీసుకోవడంలో తప్పులేదు. కాకపోతే దానికి సంబంధించి విధివిధానాలను క్షుణ్నంగా చదివి అర్థంచేసుకోండి. మీ సమాచారం ఇతరులకు అందించే వెసులుబాటును కల్పించకపోవడం మంచిదని సూచిస్తున్నాం.
ఇదీ చూడండి: మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 4.7 శాతమే